ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు 

ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు 
  • ఇంటింటి ప్రచారం షురూ
  • కుల సంఘాలతో మీటింగ్ లు, మద్దతు కోసం మంతనాలు

మెదక్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్​సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎన్నికల షెడ్యూల్​ వెలువడినప్పటి నుంచే బీఆర్​ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తల మీటింగ్​లు నిర్వహించాయి. అభ్యర్థులు ఖరారయ్యాక మండల స్థాయి మీటింగ్​లు పెట్టారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలయ్యాక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు, రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​ లు, అగ్రనేతల బహిరంగ సభలు జరిగాయి.

ఆయా వేదికల ద్వారా తమ పార్టీ విధానాలు తెలియజెప్పడంతోపాటు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో మూడు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి ప్రచారంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి. పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ స్థానిక నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఇంటింటికీ తిరిగి పార్టీ గుర్తులు పంచుతూ ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. పట్టణాల్లో షాప్​ టు షాప్​ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

ప్రచార గడువు ముగిసే వరకు ప్రతీ గ్రామంలో ప్రతీ వార్డులో, ప్రతీ పట్టణంలో ఇంటింటికి వెళ్లి పార్టీ గుర్తులున్న కరపత్రాలు పంచి ప్రచారం చేసేలా ప్లాన్​ చేశారు. అలాగే మరోవైపు వివిధ సామాజిక వర్గాలు, కుల సంఘాలు, వృత్తి, వ్యాపార సంఘాలతో మీటింగ్​లు నిర్వహిస్తూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్నిచోట్ల ఆయా సంఘాల వారికి సంఘ భవనాలకు, ఆలయాల నిర్మాణానికి ఆర్థిక చేయూత అందిస్తుండగా, మరికొన్నిచోట్ల వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.

ఇంకోవైపు పోల్​ మేనేజ్​ మెంట్​పై దృష్టి పెట్టారు. బూత్​ కమిటీ ఇన్​చార్జిలను యాక్టివ్​ చేస్తూ ఆయా బూత్​ల పరిధిలో ఉన్నఓటర్లందరినీ పోలింగ్​ కేంద్రాలకు తరలించి ఓటేయించే బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఆయా బూత్​లలో లభించిన ఓట్లను పరిగణలోకి తీసుకుని లోక్​ సభ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు పోలయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు.