రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్​హెచ్ఏఐ ఫోకస్

రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్​హెచ్ఏఐ ఫోకస్
  • రోడ్లపై పగుళ్లు, గుంతలు ఏర్పడితే.. ఆటోమేటిక్​గా పూడ్చుకుపోతయ్
  • ఒక్కసారి వేస్తే.. 80 ఏండ్ల వరకూ ఉండే చాన్స్
  • నెదర్లాండ్స్​లో 2010లో ఇలాంటి రోడ్లు ప్రారంభం 

న్యూఢిల్లీ: ఇకపై డాంబర్ రోడ్లపై పగుళ్లు వస్తే..  వాటంతట అవే మూసుకుపోనున్నాయి. హైవేలపై గుంతలు పడితే ఆటోమేటిక్​గా పూడ్చుకుపోతూ.. వాహనదారులకు యాక్సిడెంట్ల ముప్పును తప్పించనున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ‘సెల్ఫ్ హీలింగ్ రోడ్’ అనే ఈ టెక్నాలజీని మన దేశంలో ప్రవేశపెట్టడంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ఫోకస్ పెట్టింది. ముందుగా సెల్ఫ్ రిపేర్ రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, దాని వల్ల కలిగే లాభాలను తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ నిర్వహించేందుకు సిద్ధమైంది.

అన్నీ ఓకే అనుకుంటే ఆ తర్వాత ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. హైవేలపై గుంతల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా సార్లు విలువైన ప్రాణాలు సైతం పోతున్నాయి. అందుకే సెల్ఫ్​ హీలింగ్ టెక్నాలజీతో హైవేలను నిర్మిస్తే.. గుంతల సమస్యకు చెక్ పెట్టవచ్చని, తద్వారా యాక్సిడెంట్ల ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.   

రోడ్ల సెల్ఫ్ రిపేరింగ్ ఇలా.. 

ఈ రోడ్లను వేసేందుకు కొత్త రకం డాంబర్ ను వినియోగిస్తారు. చిన్న చిన్న ఉక్కు తీగలు, ఇసుక, చిన్న చిన్న కంకర రాళ్లు, డాంబర్ ను కలిపి రోడ్లను నిర్మిస్తారు. దీంతో రోడ్లపై ఎప్పుడైనా క్రాక్స్ ఏర్పడితే ఈ డాంబర్ కరిగిపోయి ఆ క్రాక్స్ ను పూడ్చేస్తుంది. ఒకవేళ క్రాక్స్ పెద్దవి అయిపోయి గుంతలు ఏర్పడినా.. ఉక్కుతీగలతోసహా డాంబర్ ఆ గుంతల్లోకి జారుకుని, పూర్తిగా విస్తరిస్తుంది. సాధారణ బీటీ రోడ్లతో పోలిస్తే.. ఈ రోడ్ల లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏకంగా 80 ఏండ్ల వరకు కూడా ఈ రోడ్లు మన్నికగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే, సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీతో వేసే డాంబర్ రోడ్లకు ఖర్చు 

నెదర్లాండ్స్ లో 2010లోనే ప్రారంభం.. 

సెల్ఫ్ హీలింగ్ రోడ్ టెక్నాలజీని నెదర్లాండ్స్ లోని డెల్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎరిక్ ష్కాలంగెన్ అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీతో ఆ దేశంలో 12 రోడ్లను నిర్మించారు. ఇప్పటికీ ఇవన్నీ పర్ ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. బయటి నుంచి ఎలాంటి రిపేర్లు అవసరం లేకుండా వాటంతట అవే రిపేర్లు చేసుకుంటున్నాయి. ఈ రోడ్లలో ఒకటి 2010లోనే ప్రారంభం కాగా, దానిపై వాహనాల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా బ్రిటన్ లోనూ పలు యూనివర్సిటీలు సొంత సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ తయారు చేసి రోడ్లు నిర్మించడంపై దృష్టి పెట్టాయి.