స్కూల్లో విషాదం: హాస్టల్‌లో పడుకున్న విద్యార్థుల కళ్ళపై ఫెవిక్విక్.. ప్రిన్సిపాల్ సస్పెండ్..

స్కూల్లో విషాదం: హాస్టల్‌లో పడుకున్న విద్యార్థుల కళ్ళపై ఫెవిక్విక్.. ప్రిన్సిపాల్ సస్పెండ్..

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని ఒక ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు పడుకొని ఉండగా  కొంతమంది తోటి విద్యార్థులు వారి కళ్ళపై ఫెవిక్విక్ పోశారు. దింతో వారి కళ్ళకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఫిరింగియా బ్లాక్‌లోని సలాగూడలోని సేవాశ్రమ్ స్కూల్లో జరిగింది.  

విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు:  గాయపడ్డ 8 మంది చిన్నారుల్లో  4, 5 తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థులు ఉండగా, వీరిని శుక్రవారం గోచ్చపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళగా, తరువాత ఫుల్బానీలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం కళ్ళకు స్వల్ప గాయం అయ్యిందని, సరైన టైంకి వైద్యం అందించడం వల్ల శాశ్వతంగా కంటిచూపు పోయే ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. అయితే వీరిలో ఒకరిని ఇంటికి పంపించగా, ఏడుగురిని హాస్పిటల్ పరిశీలనలో ఉంచారు.

ప్రిన్సిపాల్ సస్పెన్షన్: ఈ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా యంత్రాంగం, స్కూల్ ప్రిన్సిపాల్ మనోరంజన్ సాహును వెంటనే సస్పెండ్ చేసింది. అలాగే వార్డెన్లు, సూపరింటెండెంట్ సహా హాస్టల్ సిబ్బందిపై దర్యాప్తు చేపట్టింది. అసలు స్కూల్లో  పిల్లల చేతికి ఫెవిక్విక్ ఎలా వచ్చింది, ఇది అనుకోకుండా జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని కూడా అధికారులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

బాధితుల తల్లిదండ్రులు, స్థానిక సంఘల నాయకులు దీనికి కారణమైన బాధ్యులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని  జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ  ఘటన ఒడిశాలోని గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల భద్రత పై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తుంది.