Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నోళ్ల నెత్తిన పెద్ద బండే పడేలా ఉందిగా..!

 Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నోళ్ల నెత్తిన పెద్ద బండే పడేలా ఉందిగా..!

క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందే అవకాశం ఉంటుందని ఆశించి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులకు పెద్ద పిడుగు లాంటి వార్త ఇది. క్యాష్ లెస్ సర్వీసుల విషయంలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ సవ్యంగా వ్యవహరించడం లేదని అసోషియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ తెలిపింది. నగదు రహిత చెల్లింపుల విషయంలో ఆసుపత్రులను సదరు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్న అసోషియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (AHPI).. క్యాష్లెస్ ట్రీట్మెంట్ వెసులుబాటును స్టార్ హెల్త్కు నిలిపివేస్తామని హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా దాదాపు 15 వేలకు పైగా హాస్పిటల్స్ AHPI అసోసియేషన్లో మెంబర్స్గా వ్యవహరిస్తున్నాయి. అలాంటి అసోషియేషన్ స్టార్ హెల్త్ వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉండటం, స్టార్ హెల్త్కు క్యాష్ లెస్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించడంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుల్లో ఆందోళన నెలకొంది. స్టార్ హెల్త్ క్యాష్ లెస్ సేవలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో తమకు ఫిర్యాదులు అందాయని.. సెప్టెంబర్ 22 నుంచి స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సర్వీస్ను నిలిపివేస్తామని AHPI స్పష్టం చేసింది.

క్లెయిమ్ సెటిల్ మెంట్స్ విషయంలో Bajaj Allianz General Insurance కంపెనీతో పాటు Care Health Insurance కంపెనీపై కూడా గత నెలలో (ఆగస్ట్) ఫిర్యాదులు రావడంతో ఈ రెండు కంపెనీలకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ సర్వీస్ ను నిలిపివేస్తామని అప్పట్లో కూడా AHPI హెచ్చరించింది. అయితే.. ఈ రెండు కంపెనీలు తక్షణమే చర్చలు జరిపి.. అసోషియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్తో మాట్లాడి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. స్టార్ హెల్త్ సంస్థ ఇప్పుడు ఏం చేస్తుందోననే టెన్షన్ పాలసీదారుల్లో ఉంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ 2023-24 రిపోర్ట్ను AHPI ప్రస్తావించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. స్టార్ హెల్త్పై 13 వేల 300 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 10 వేలకు పైగా క్యా్ష్ లెస్ క్లెయిమ్ రిజెక్షన్స్కు సంబంధించినవేనని గుర్తుచేసింది. గ్రీవెన్స్ చార్ట్లో ఫిర్యాదులు అందిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల లిస్ట్లో స్టార్ హెల్త్ టాప్లో ఉందని AHPI వెల్లడించింది.

AHPI వార్నింగ్పై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. క్యాష్ లెస్ సేవల నిలిపివేతకు సంబంధించి తమతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న హాస్పిటల్స్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపింది. అసోషియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ తీరు పాలసీదారులను గందరగోళానికి గురిచేసేలా ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలియజేస్తూ జీఎస్టీని కూడా తొలగించిన సందర్భంలో ఇలాంటి అస్పష్టమైన హెచ్చరికలు, ప్రకటనలు దురదృష్టకరమని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటికైతే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సేవలను నిలిపివేయడం జరగలేదు. సెప్టెంబర్ 22 లోపు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి, అసోషియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ మధ్య చర్చలు జరిగి.. ఆ చర్చలు సఫలం అయితే ఎలాంటి సమస్య లేకుండా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కొనసాగుతుంది.