పెట్టుబడి ప్రపంచంలో కొత్త ట్రెండ్: క్లైమేట్-ఫోకస్డ్ AIFల వైపు ఇన్వెస్టర్ల చూపు

పెట్టుబడి ప్రపంచంలో కొత్త ట్రెండ్: క్లైమేట్-ఫోకస్డ్ AIFల వైపు ఇన్వెస్టర్ల చూపు

దేశంలో పెట్టుబడి మార్గాలు, సాధనాలు వేగంగా మారుతున్నాయి. కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లకే పరిమితం కాకుండా.. సంపన్న వర్గాలు, ఫ్యామిలీ ఆఫీసులు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్(AIFs) వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను అరికట్టే లక్ష్యంతో పనిచేసే 'క్లైమేట్-ఫోకస్డ్ AIFs' ఇప్పుడు ఒక శక్తివంతమైన ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అవతరించాయి. ఇవి కేవలం సామాజిక బాధ్యత కోసం మాత్రమే కాకుండా, దీర్ఘకాలంలో భారీ లాభాలను అందించేవిగా పెట్టుబడిదారులు చూస్తున్నారు. 

సాధారణ మ్యూచువల్ ఫండ్లు స్టాక్ మార్కెట్‌లోని లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెడితే.. AIFలు ప్రైవేట్ క్యాపిటల్‌ను సేకరించి స్టార్టప్‌లు, అన్‌లిస్టెడ్ కంపెనీలు, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. క్లైమేట్-ఫోకస్డ్ AIFలు ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటర్ మేనేజ్మెంట్, పారిశ్రామిక డీకార్బనైజేషన్ వంటి రంగాలపై దృష్టి సారిస్తాయి. ఇవి అధిక రిస్క్‌తో కూడుకున్నవి అయినప్పటికీ.. భవిష్యత్తులో ఈ రంగాలు సాధించబోయే అద్భుతమైన వృద్ధి వల్ల ఇన్వెస్టర్లకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే క్లైమేట్ ఏంజెల్స్, టీపీజీ రైజ్ క్లైమేట్ వంటి సంస్థలు వేల కోట్ల రూపాయలను సేకరించి ఈ మార్పుకు నాంది పలికాయి దేశంలో.

►ALSO READ | రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్: ఆర్థిక నిపుణులు సూచించిన 'త్రీ-బకెట్' వ్యూహం ఇదే..

సెబీ తీసుకువచ్చిన తాజా సవరణలు AIF వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. 2025లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు పెట్టుబడులలో పారదర్శకతను పెంచడంతో పాటు, గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లకు నిబంధనలను సరళతరం చేశాయి. సాంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో తక్కువ రిటర్న్స్ వస్తుండటంతో, ఇన్వెస్టర్లు ప్రైవేట్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఎనర్జీ ట్రాన్సిషన్, బ్యాటరీ స్టోరేజ్, క్లైమేట్-రెసిలెంట్ అగ్రికల్చర్ వంటి రంగాలు పెట్టుబడులకు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. నెట్-జీరో లక్ష్యాల దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో.. ఈ ఫండ్స్ దేశ ఆర్థిక,పర్యావరణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి.