ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన 'కాయిన్‌బేస్' సీఈఓ బ్రియన్ ఆర్మ్‌స్ట్రాంగ్ తాజాగా హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఆరంభంలో తమ కంపెనీపై జరిగిన సైబర్ దాడిలో ప్రమేయం ఉన్న ఒక మాజీ ఏజెంట్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో బ్రియన్ ఆర్మ్‌స్ట్రాంగ్ హర్షం వ్యక్తం చేశారు. "తప్పు చేసే వారి పట్ల మేము ఏమాత్రం సహనం వహించము. నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేందుకు అధికారులతో కలిసి పనిచేస్తాం" అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
గతంలో జరిగిన సైబర్ అటాక్ వివరాలు:
ఈ ఏడాది మే నెలలో కాయిన్‌బేస్ కంపెనీ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. అమెరికా వెలుపల పనిచేస్తున్న తమ సంస్థ కాంట్రాక్టర్లు లేదా ఉద్యోగులకు హ్యాకర్లు లంచం ఇచ్చి.. కస్టమర్ డేటాను దొంగిలించారని సంస్థ తెలిపింది. ఆ డేటాను తిరిగి ఇచ్చేందుకు హ్యాకర్లు ఏకంగా 20 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.167 కోట్లు డిమాండ్ చేశారు. ఈ సైబర్ దాడి వల్ల కంపెనీకి దాదాపు 400 మిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లవచ్చని అప్పట్లో అంచనా వేసింది.
అయితే ఈ భారీ డిమాండ్‌కు తలొగ్గకుండా కాయిన్‌బేస్ ధైర్యంగా ముందడుగు వేసింది. హ్యాకర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకూడదని నిర్ణయించుకున్న సంస్థ.. ఆ 20 మిలియన్ డాలర్లను నేరస్థులను పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అలాగే ఈ దాడి వల్ల నష్టపోయిన వినియోగదారులకు తమ స్వంత నిధుల నుండి పరిహారం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు జరిపిన దర్యాప్తులో సైబర్ క్రైమ్ వెనుక ఉన్న కీలక నిందితుల్లో ఒకరిని పట్టుకోవడం విశేషం. నిందితులు కస్టమర్ల లాగా నటిస్తూ మోసపూరిత స్కీమ్స్ నడిపినట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో క్రిప్టో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని.. కంపెనీ ఎప్పుడూ పాస్‌వర్డ్‌లు లేదా నిధుల ట్రాన్స్‌ఫర్ చేయమని అడగదని కాయిన్‌బేస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరించింది.
