సంక్రాంతికి.. కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభం ..అన్ని సేవలు ఒకే చోట..

సంక్రాంతికి.. కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభం ..అన్ని సేవలు ఒకే చోట..
  • సీఎం చేతులమీదుగా ప్రారంభించే యోచన
  •  కరీంనగర్​ కొత్త కలెక్టరేట్ లోనే గణతంత్ర వేడుకలు
  •  పాత కలెక్టరేట్ కూల్చివేత ఇప్పట్లో లేనట్టే? 

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహంతో సహా అన్ని హంగులతో ముస్తాబైంది. ఇప్పటికే బిల్డింగ్ లోపల సీలింగ్ పనులు  పూర్తి కావొస్తుండగా ఆవరణలోనూ సీసీ రోడ్డు వర్క్స్ పూర్తి చేసి, వాటర్ క్యూరింగ్ చేస్తున్నారు. సంక్రాంతికి కొత్త కలెక్టరేట్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. అదే జరిగితే కొత్త బిల్డింగ్​లోనే గణతంత్ర వేడుకలు నిర్వహిస్తారు.

నాలుగేళ్లు సాగిన పనులు 

చాలా కొత్త జిల్లాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమయ్యాయి. వీటిలో కొన్ని పూర్తయి అందుబాటులోకి వచ్చినప్పటికీ మరికొన్ని పూర్తి కాలేదు.  కరీంనగర్ కలెక్టరేట్ పనులు రూ.51 కోట్లతో 2021 డిసెంబర్ లో మొదలయ్యాయి. అప్పట్లో ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. రెండేళ్ల తర్వాత ఎన్నికల ముందు పనుల్లో వేగం పెంచినా పూర్తి కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. 

అన్ని సేవలు ఒకే ప్రాంగణంలో.. 

ఇప్పటివరకు చాలా ప్రభుత్వ శాఖలను వేర్వేరు చోట్ల అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో అద్దెల భారం పెరగడంతోపాటు వివిధ పనులపై వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభమైతే ఆ బాధలు తొలగనున్నాయి. 

పాత బిల్డింగ్​ కూల్చొద్దని నిర్ణయం!

వాస్తవానికి కొత్త కలెక్టరేట్​నిర్మాణం కోసం పాత కలెక్టరేట్​లోని సగ భాగాన్ని కూల్చివేశారు. మిగతా సగ భాగంలో ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొత్త బిల్డింగ్ పూర్తయ్యాక పాత బిల్డింగ్ ను పూర్తిగా కూల్చివేసి ల్యాండ్ స్కేప్ గా అభివృద్ధి చేయాల్సి ఉంది. 

కానీ పాత కలెక్టరేట్ బిల్డింగ్ ను మరో 30 ఏండ్లు వినియోగించుకోవచ్చని ఆర్ అండ్ బీ ఇంజినీర్లు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ భవనాన్ని ఇప్పుడే కూల్చొద్దని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాన్ని ప్రభుత్వ ఇతర అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.