బెంగాల్ మాట్లాడేవారిని బీజేపీ అణచివేస్తోందని ఆరోపించారు వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ. బెంగాలీలే టార్గెట్ గా భారతీయ జనతాపార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బెంగాలీలపై దాడులు తీవ్రమయ్యాయని.. వలస కార్మికులపై దాడులు చేస్తూ, హింసిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బెంగాల్ మాట్లాడే కుటుంబాలను, కూలీలను టార్గెట్ చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని ఎక్స్ (ట్విట్టర్ వేదికగా) ఆరోపించారు దీదీ. అణచివేతకు గురవుతున్న బెంగాల్ కార్మికులకు అండగా ఉంటాం.. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. బెంగాల్ మాట్లాడటం నేరం కాదనేది గుర్తించుకోవాలని అన్నారు.
ఒడిశాలో బెంగాల్ కూలీ హత్యపై దుమారం :
ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో బెంగాల్ కార్మికుడి హత్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. డిసెంబర్ 24న వెస్ట్ బెంగాల్ ముర్షీదాబాద్ కు చెందిన వలస కార్మికులపై దాడులు జరిగాయి. ఇద్దరు తప్పించుకోగా.. జుయెల్ రానా అనే వ్యక్తి దాడిలో చనిపోయాడు. కార్మికులు బెంగాలీలో మాట్లాడటంతో.. బంగ్లాదేశీయులుగా అనుమానించి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇది పథకం ప్రకారం చేసిన హత్య కాదని.. బీడీ విషయంలో వచ్చిన వివాదంతో జరిగిందని పోలీసులు ఒడిశా పోలీసులు చెబుతున్నారు.
►ALSO READ | ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరిక వ్యవస్థా? ఉపాధి హామీ పేరు మార్పుపై రాహుల్ ఫైర్
ఈ ఘటన దురదృష్టకరమని చెప్పిన దీదీ.. ఒడిశా నుంచి కూలీలు ముర్షీదాబాద్ కు తిరిగి వస్తున్నారు. వారి కుటుంబాలకు సంఘీభావం చెప్పిన ఆమె.. ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
రంగంలోకి బెంగాల్ పోలీసులు:
ఒడిశా ఘటనపై విచారణకు బెంగాల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ముర్షీదాబాద్ సూతీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జుయెల్ రానా మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెప్పారు. దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
