సువర్ణాపురం అనే ఊరి శివారులో హేమగిరి అనే పెద్ద కొండ ఉండేది. ఆ కొండ మట్టిలో బంగారం ఉందని, అక్కడ తవ్వితే అపారమైన సంపద దొరుకుతుందని అందరూ నమ్మేవారు. అయితే, ఆ గట్టి నేలను తవ్వి బంగారాన్ని వేరు చేయడం చాలా కష్టమైన పని అని భావించి ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. కానీ, సామాన్య ప్రజలు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వేల సంఖ్యలో ఆ కొండ దగ్గరకు చేరుకోసాగారు. ఎలాగైనా బంగారం సంపాదించి ధనవంతులు అయిపోవాలనే ఆశతో రాత్రింబవళ్లు తవ్వడం మొదలుపెట్టారు. అదే ఊరిలో ఈశ్వరయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. తన తండ్రి రామబ్రహ్మం దగ్గర నేర్చుకున్న ఇనుప పనిని నమ్ముకుని జీవించేవాడు. అయితే, ఆ రోజుల్లో ఊరిలో కొత్త ఇళ్లు కట్టేవారు లేక అతని వ్యాపారం అస్సలు సాగలేదు. చేసిన అప్పులు తీరక, తిండికి కూడా కష్టమై దిక్కుతోచని స్థితిలో ఈశ్వరయ్య తన తండ్రి దగ్గర బాధపడ్డాడు.
‘‘నాన్నా! ఊరంతా కొండ దగ్గర బంగారం తవ్వుకుంటూ సంపాదిస్తున్నారు. మనం మాత్రం ఈ పాత ఇనుము ముక్కలతో కుస్తీ పడుతున్నాం. మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి?’’ అని ఆవేదన చెందాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకు భుజం తట్టి ఇలా అన్నాడు.
‘‘నాయనా! అందరూ వెళ్లే దారిలోనే మనం కూడా వెళ్లడం గొప్ప కాదు. ఎదుటివారి అవసరాన్ని గుర్తించేవాడే నిజమైన వ్యాపారి. ఇప్పుడు ఆ కొండ దగ్గర వేలమంది ఉన్నారు కదా! వారందరికీ మట్టి తవ్వడానికి కచ్చితంగా, గునపాలు కావాలి. నువ్వు ఆ బంగారం వెనుక పరుగులు తీయకు. ఆ బంగారం తవ్వే వారికి కావాల్సిన పనిముట్లు తయారు చేసి ఇవ్వు. నీ నైపుణ్యానికి వారి అవసరాన్ని జోడించు’’ అని ఒక గొప్ప రహస్యాన్ని బోధించాడు.
తండ్రి మాటలతో ఈశ్వరయ్యకు కొత్త ఉత్సాహం వచ్చింది. మరుసటి రోజే కొండకు వెళ్లే దారిలో ఒక చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. గనిలో తవ్వేవారికి అనువుగా ఉండేలా పదునైన గునపాలు, పారలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. కొండ దగ్గర తవ్వే ప్రతి ఒక్కరికీ ఈశ్వరయ్య తయారు చేసిన నాణ్యమైన పనిముట్లు తప్పనిసరి అయ్యాయి. గనిలో బంగారం ఎవరికైనా దొరికిందో లేదో కానీ, ఈశ్వరయ్యకు మాత్రం తండ్రి చెప్పిన ఉపాయంతో కొద్ది కాలంలోనే అపారమైన సంపద చేకూరింది. అలా ‘‘లోకమంతా బంగారం తవ్వే పనిలో పడ్డప్పుడు నువ్వు గునపాలు చేసి అమ్ము’’ అనే మాట గొప్ప వ్యాపార సూత్రంగా మారి, ఈనాటికీ ప్రజల నాలుకలపై సామెతగా ప్రచారంలో ఉంది.
- డా. పోతగాని సత్యనారాయణ
