రాష్ట్రంలోని అన్నీ తండాల్లో BT రోడ్లు వేయాలని ఆదేశిస్తున్నా: సీఎం రేవంత్

రాష్ట్రంలోని అన్నీ తండాల్లో BT రోడ్లు వేయాలని ఆదేశిస్తున్నా: సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ట్రైబల్ సెక్రటరీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కొన్ని తండాలకు ఇప్పటికీ కూడా తాగునీరు, కరెంట్ రావట్లేదన్నారు. గిరిజన సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 15) బంజారాహిల్స్‎లోని బంజారా భవన్‎లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు పాలించిన పాలకులు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో అత్యధిక రేషన్ కార్డులు లంబాడ సోదరులకు దక్కేలా ప్రణాళికలు చేశామని తెలిపారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న సన్న బియ్యం మంచిగా ఉందా లేదా అని.. భద్రాచలంలో ఒక గిరిజన కుటుంబంలో భోజనం చేసి వచ్చానని చెప్పారు. 

రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు వాడుకుంటున్నాయన్నారు. ఇప్పటి వరకు రూ. 9 వేల కోట్ల రూపాయలు ఉచిత బస్సు పథకం కోసం ఖర్చు చేశామని తెలిపారు. సోలార్ బిజినెస్ అంటే ఒకప్పుడు అదానీ, అంబానీలు చేసే బిజినెస్ అనుకునేవాళ్ళు.. కానీ ఇప్పుడు గిరిజన మహిళలతో సోలార్ బిజినెస్ చేయిస్తున్నామని పేర్కొన్నారు.  

గ్రూప్-1 లో 87 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ , బీసీ విద్యార్థులకు వచ్చాయని తెలిపారు. పేదలకు ఉద్యోగాలు వస్తే ప్రశ్నించే గొంతుక వస్తుందని ప్రతిపక్షాలు గ్రూప్-1 పై కుట్ర పన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా జరపడం మా బాధ్యత అని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో లంబాడ సోదరుల బాధ్యతను ఎవరు విస్మరించలేరన్నారు. నా 20 సంవత్సరాల రాజకీయ జీవితం ఎదుగుదలలో లంబాడాల పాత్ర ఉందని.. ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డారని చెప్పారు.