విజయ్ ఫ్యాన్స్‎కు బ్యాడ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికల తర్వాతే జన నాయగన్ రిలీజ్..?

విజయ్ ఫ్యాన్స్‎కు బ్యాడ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికల తర్వాతే జన నాయగన్ రిలీజ్..?

చెన్నై: దళపతి విజయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. విజయ్ నటించిన లేటేస్ట్ చిత్రం జన నాయగన్ విడుదల మరోసారి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే మూవీ విడుదల కానున్నట్లు సమాచారం. ఈ మేరకు కెనడియన్ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ జన నాయగన్ విడుదలపై కీలక ప్రకటన చేసింది. 2026, ఏప్రిల్ 30కి ముందు విజయ్ జన నాయగన్ సినిమా విడుదల కాదని తేల్చిచెప్పింది. సినిమా రిలీజ్ డేట్‎ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. 

వివాదం ఏంటంటే..?

దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2026, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జన నాయగన్ మూవీపై భారీ హైప్ నెలకొంది. 

అయితే.. మూవీ విడుదలకు వారం రోజుల ముందు జన నాయగన్ సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయగన్ విడుదల వాయిదా పడింది. సీబీఎఫ్సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ మూవీ నిర్మాత మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

కానీ నిర్మాతకు న్యాయస్థానంలో ఊరట దక్కలేదు. చేసేదేమి లేక సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు మూవీ యూనిట్ అంగీకరించింది. అవసరమైన ఎడిట్స్ పూర్తి  చేసి ఫైనల్ కట్ వెర్షన్‎ను సెన్సార్ బోర్డుకు పంపినట్లు తెలిసింది. 

సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 2026, ఫిబ్రవరి 20వ తేదీన సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో జన నాయగన్ విడుదల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతికి పోస్ట్ పోన్ అయ్యింది. జన నాయగన్ రిలీజ్ మరోసారి వాయిదా పడటంతో విజయ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.