పతనం దిశగా 'కింగ్ డాలర్'.. ఇక బంగారానిదే పెత్తనం: ఇన్వెస్టర్లకు పీటర్ షిఫ్ హెచ్చరిక

పతనం దిశగా 'కింగ్ డాలర్'.. ఇక బంగారానిదే పెత్తనం: ఇన్వెస్టర్లకు పీటర్ షిఫ్ హెచ్చరిక

డాలర్ సామ్రాజ్యం అంతరించిపోనుందా? ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు అమెరికన్ డాలర్‌ను కాదని బంగారాన్ని తమ ప్రధాన ఆస్తిగా మార్చుకోబోతున్నాయా? ప్రముఖ ఆర్థికవేత్త పీటర్ షిఫ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. డాలర్ తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని, ఇన్వెస్టర్లు మరో హిస్టారిక్ ఆర్థిక పతనానికి సిద్ధంగా ఉండాలని పీటర్ షిఫ్ హెచ్చరిస్తున్నారు.

అమెరికా డాలర్ యుగం ముగింపు దశకు చేరుకుందని యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఎకనామిస్ట్ పీటర్ షిఫ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసించిన డాలర్ స్థానాన్ని త్వరలోనే బంగారం భర్తీ చేస్తుందని అన్నారు. దీనివల్ల ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ భారీగా పడిపోతుందని.. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తన ఎక్స్ పోస్టులో చెప్పారు. అయితే ఈ హీట్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. బంగారానికి డిమాండ్ పెరుగుతూ పోతున్న వేళ డాలర్ బలహీనపడటం కూడా కనిపిస్తోంది.

కొన్ని రోజులుగా బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మొదటిసారిగా గోల్డ్ 4,500 డాలర్ల మార్కును దాటి, ప్రస్తుతం 4,537 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 2025 సంవత్సరం బంగారానికి ఒక మైల్ స్టోన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్‌లో కూడా రూపాయి బలహీనపడటం, సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల బంగారం ధరలు దాదాపు 80 శాతం మేర పెరిగాయి. ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం 50 సార్లకు పైగా ఆల్‌-టైమ్ హై రికార్డులను సృష్టించిందని  వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

ALSO READ : న్యూ ఇయర్ ముందు గోల్డ్, సిల్వర్ నాన్ స్టాప్ ర్యాలీ.. 

2026లో కూడా భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించి, వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వైపు పెట్టుబడులు ఇంకా పెరుగుతాయని ఇది రేట్లను ప్రభావితం చేస్తుందని వారు చెబుతున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, భౌగోళిక ఉద్రిక్తతలను తగ్గిస్తే మాత్రం డాలర్ పుంజుకుని బంగారం ధరలు కొంత తగ్గే అవకాశం కనిపిస్తున్నా.. వాస్తవ స్థాయిలో ఇది ఏ మేరకు జరగుతుందనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. 

 డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతున్న ప్రస్తుత తరుణంలో.. బంగారం ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ నిల్వలను తగ్గించుకుని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవటం ఈ మార్పునకు నిదర్శనం. ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షణ పొందాలనుకునే వారికి మళ్లీ బంగారే దిక్కుగా మారుతోందని ఈ పరిస్థితులు నిరూపిస్తున్నాయి.