సంక్రాంతి సెలవులపై సందిగ్ధం!..కనుమ నాడు క్లాసులు వినాల్సిందేనా?

సంక్రాంతి సెలవులపై సందిగ్ధం!..కనుమ నాడు క్లాసులు వినాల్సిందేనా?
  • విద్యాశాఖ లిస్టులో 15 వరకే హాలిడేస్
  • సర్కారు తాజా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16న కనుమ

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై సందిగ్ధత నెలకొన్నది. అకాడమిక్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, సర్కారు తాజా పండుగ తేదీలకు పొంతన కుదరకపోవడంతో.. అసలు బడులు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటాయనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. పాత షెడ్యూల్ ప్రకారం జనవరి 15 వరకే సెలవులు ఉండగా.. 16న ‘కనుమ’ పండుగ ఉందని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 

దీంతో కనుమ పండుగ రోజు బడులకు పోవాలా? వద్దా? అనే దానిపై స్పష్టత కరువైంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు 2025–26 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం.. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులను ఖరారు చేశారు. 

అప్పట్లో జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉంటాయని అధికారులు భావించి ఈ డేట్స్ ఫిక్స్ చేశారు. దీనికి తోడు జనవరి 10న రెండో శనివారం కావడంతో.. 10 నుంచి 15 వరకు వరుసగా 6 రోజులు పండుగ చేసుకోవచ్చని అంతా ఫిక్సయ్యారు. కానీ, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్, సెలవుల జాబితా ప్రకారం పండుగ తేదీలు మారాయి. 

జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. దీంతో విద్యాశాఖ పాత షెడ్యూల్ ప్రకారం 15 వరకే సెలవులు ఉన్నాయి. అంటే 16న కనుమ పండుగ రోజున స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయి.  తెలంగాణలోనూ సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకోవడం కొన్నేండ్లుగా ఆనవాయితీగా ఉంది. 

మరోపక్క ఆంధ్ర సెటిలర్స్ కూడా హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లోనూ నివాసం ఉంటున్నారు. దీంతో కనుమకు సెలవులు ఇస్తారా? లేదా? అనే నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం సెలవుల జాబితాను ప్రకటించి.. 2 వారాలు అయినా, కనీసం సంక్రాంతి సెలవుల మార్పుపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అయితే, ఎలాంటి ఆలోచన చేయలేదని విద్యాశాఖ అధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు.