అమెరికా H-1B వీసాల రూల్స్ కఠినతరం చేయటంతో.. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల చూపు భారత్ వైపు మళ్లింది. 2025లో మెటా, ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ కంపెనీలు భారత్‌లో రికార్డు స్థాయిలో 32వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువ. ప్రస్తుతం ఈ 6 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య భారత్‌లో 2.14 లక్షలకు చేరింది. అయితే ఇదంతా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జరుగుతున్న మార్పులుగా చెప్పుకోవచ్చు.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొత్త వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధించడం, లాటరీ పద్ధతిలో మార్పులు చేయడంతో ఐటీ కంపెనీలకు భారతీయులను అమెరికా తీసుకెళ్లడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. దీనికి తోడు ప్రతిపాదిత 'హైర్ యాక్ట్' వల్ల పెరిగే ఖర్చుల కంటే, భారత్‌లోనే టాలెంటెడ్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవటం ఆర్థికంగా లాభదాయకమని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ఆన్-సైట్ పనులను తగ్గించి, భారత్ కేంద్రంగానే గ్లోబల్ ప్రాజెక్టులను నిర్వహించేలా తమ వ్యూహాలను మార్చుకున్నాయి.
ప్రస్తుతం ఈ కంపెనీలు జనరలిస్ట్ పాత్రల కంటే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ ఆప్స్, డేటా ఇంజనీరింగ్, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ వంటి విభాగాల్లో రిక్రూట్మెంట్లను జోరుగా సాగుతున్నాయి. అలాగే ఏఐ విస్తరణ వల్ల రాబోయే రెండేళ్లలో మరిన్ని కొత్త రకపు ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ : కొత్త ఏడాదిలో హోటల్ ఇండస్ట్రీకి మంచి రోజులు..
భారీ పెట్టుబడులు - కొత్త ఆఫీసులు:
1. గూగుల్: విశాఖపట్నంలో ఏఐ హబ్ కోసం రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా లక్ష ఉద్యోగాలు రానున్నాయని అంచనా.
2. మైక్రోసాఫ్ట్: క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాల కోసం రూ.1.45 లక్షల కోట్లు కేటాయించింది.
3. అమెజాన్: రాబోయే ఐదేళ్లలో రూ. 2.90 లక్షల కోట్లు పెట్టుబడితో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుంది.
4. ఓపెన్ ఏఐ: కంపెనీ ఇండియాలో తన ఫస్ట్ ఆఫీసును న్యూఢిల్లీలో ప్రారంభించనుంది. ఇప్పటికే మెటా, ఆపిల్ కూడా బెంగళూరు, హైదరాబాద్‌లలో తమ కార్యాలయాలను భారీగా విస్తరిస్తున్నాయి.
ఈ పరిస్థితులతో ఇండియాలో 2026లో కూడా బిగ్ టెక్ నియామకాలు 16-20 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా లే-ఆఫ్స్ భయాలు ఉన్నప్పటికీ, భారత్‌లో ఉన్న టాలెంట్, తక్కువ నిర్వహణ ఖర్చుల కారణంగా అమెరికన్ కంపెనీలు మన దేశాన్ని తమ ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకుంటున్నాయి. ఇది హై టాలెంటెడ్ టెక్ ఉద్యోగులకు పెద్ద వరం అని చెప్పుకోవచ్చు. అమెరికా వెళ్లే కష్టాలను కూడా వారికి ఇది మరింతగా తగ్గించి దేశంలోనే మంచి ఉద్యోగ అవకాశం పొందటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు అంటున్నారు.
