రష్యా తీరంలో పెను భూకంపం ..రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత నమోదు

రష్యా తీరంలో  పెను భూకంపం ..రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత నమోదు

మాస్కో: రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 10.37 గంటలకు కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతతో భూకంపం ఏర్పడినట్టు యూఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. తీర ప్రాంతానికి 111 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 39 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్టు తెలిపింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం అందలేదు. భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందుగా హెచ్చరికలు జారీ చేసిన ‘పసిఫిక్ సునామీ వార్నింగ్ సిస్టం’.. ఆ తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. ఈ భూకంపం కారణంగా సునామీ ప్రమాదం లేదని, అయితే.. తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు స్వల్పంగా పోటెత్తవచ్చని ‘జపాన్ మెటిరియోలజికల్ ఏజెన్సీ’ అలర్ట్ జారీ చేసింది. కాగా, కామ్చాట్కా ద్వీపకల్పానికి సమీపంలో గత జులై 20వ తేదీన కూడా 7.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూమిలోపల టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అధికంగా ఉండే ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.

మరిన్ని వార్తలు