నేపాల్ ఫలితాలను మార్చేసిన జెన్-Z .. లీడ్లో బాలేంద్ర షా పార్టీ

నేపాల్ ఫలితాలను మార్చేసిన  జెన్-Z .. లీడ్లో బాలేంద్ర షా పార్టీ

నేపాల్ ఎన్నికల ఫలితాలు చరిత్రను తిరగరాసే విధంగా కనిపిస్తున్నాయి. గురువారం (మార్చి 05) జరిగిన ఎన్నికల్లో కొత్త నాయకత్వానికే జెన్-Z మొగ్గు చూపినట్లు కౌటింగ్ ఆధారంగా తెలుస్తోంది. జెన్-Z ఆందోళనలకు నాయకత్వం వహించిన బాలేంద్ర షా పార్టీకే నేపాల్ ప్రజలు జై కొట్టారు. ఎర్లీ కౌంటింగ్ రిజల్ట్స్ లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) ఆధిక్యంలో దూసుకుపోతోంది. 

ఖాట్మండు మాజీ మేయర్, ర్యాపర్ అయిన బాలేంద్ర షా పార్టీ ప్రస్తుతం ఒక చోట గెలిచి  మరో 36 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 46 నియోజకవర్గాల ఫలితాల లెక్కింపులో ఆర్ఎస్పీ దూసుకుపోతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక నేపాల్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

జెన్-జీ ఆందోళనలతో అధికారానికి దూరమైన కేపీ ఓలీ శర్మ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (UML) కేవలం3 స్థానాల్లోనే లీడ్ లో కొనసాగుతోంది. అల్లర్లు, ఆందోళనలతో గద్దెదిగిన కమ్యూనిస్టులు.. తీవ్ర అప్రతిష్టపాలై అధికారానికి దూరమవ్వటమే కాకుండా.. ప్రస్తుత ఎన్నికల్లో తిరస్కరణకు గురైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఫలితాల్లో ఆర్ఎస్పీ పార్టీ ఖాట్మండు-1 నియోజకవర్గంలో గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి రంజు దర్శన భారీ మెజారిటీతో గెలిచారు. 

ప్రాథమిక అంచనాల ప్రకారం నేపాల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో  దాదాపు 60 శాతం ఓటింగ్ నమోదైంది.  జనరల్ జెడ్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడందో భారీ ఓటింగ్ నమోదైంది. అదే ఇప్పుడు అక్కడ అధికార మార్పిడికి మూల కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. 

మొత్తం 275 సీట్లున్న ప్రతినిధుల సభకు 3 వేల 406 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నేపాల్ లో మొత్తం  కోటి 89 లక్షల 3 వేల పైచిలుకు ఓటర్లున్నారు. అయితే గత ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మొదలైన ఆరోపణలతో కొత్త తరం యువత రోడ్డెక్కి కేపీ ఓలి ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రస్తుతం జెన్-జీ ఓటింగ్ కీలకంగా మారిన సందర్భంలో.. వారి మద్ధతుతో కొత్త పార్టీ ఆర్ఎస్పీ అధికారం అందుకునే ఛాన్స్ ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.