కాబుల్: ఆప్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా ఆప్ఘాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఆప్ఘాన్ తాలిబన్ ప్రభుత్వం ధృవీకరించింది. మంగళవారం (జూన్ 30) రాత్రి పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు వెల్లడించింది.
ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొంది. ఇటీవల ఆప్ఘాన్ సరిహద్దుల్లో పాక్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఆప్ఘాన్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. దాడులు, ప్రతిదాడులతో పాక్, ఆప్ఘాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఆప్ఘాన్ దాడులపై పాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలీ.
ఆప్ఘాన్ సరిహద్దుల్లో పాక్ ఊచకోత:
జూన్ 28 అర్ధరాత్రి ఆప్ఘాన్ సరిహద్దుల్లో పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. పాక్ మెరుపు దాడుల్లో పిల్లలు, వృద్ధులతో సహా 35 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు పాక్ ప్రకటించింది. ఆప్ఘాన్ కేంద్రంగా పని చేస్తోన్న ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా అటాక్స్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడుల్లో 29 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు తెలిపింది.
చనిపోయినోళ్లంత సాధారణ పౌరులే: ఆప్ఘాన్
ఆప్ఘాన్ కేంద్రంగా పని చేస్తోన్న ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేశామన్న పాక్ ఆరోపణలను ఆప్ఘాన్ తీవ్రంగా ఖండించింది. మానవ నివాస ప్రాంతాలపై పాక్ వైమానిక దళం దాడులు జరిపిందని.. బాధితులు ఉగ్రవాదులు కాదు సాధారణ పౌరులేనని పేర్కొంది.
పక్తికా ప్రావిన్స్‌లోని జ్ఞాన్, పక్తియా ప్రావిన్స్‌లోని చమ్కానీ, కునార్ ప్రావిన్స్‌లోని మరవారా జిల్లాలలో ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ఇళ్లు, మసీదులు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించింది. పాక్ బాంబు దాడులలో 36 మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
పాక్ డబుల్-ట్యాప్ దాడులు..!
పాకిస్తాన్ వైమానిక దళం డబుల్ ట్యాప్ దాడులు చేసినట్లు ఆప్ఘాన్ ఆరోపించింది. సైనిక పరిభాషలో.. తొలి దాడి జరిగిన కొద్దిసేపటికే అదే ప్రాంతంలో రెండోసారి దాడి చేయడాన్ని డబుల్ టాప్ అటాక్ అంటారు. పాక్ తమపై ఇదే వ్యూహాన్ని అవలంభించిందని ఆప్ఘాన్ ఆరోపించింది.
తొలి విడత దాడుల్లో కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి గ్రామస్థులు సహయక చర్యలు చేపట్టగా అదే ప్రాంతాలపై రెండోసారి దాడులు జరిగాయని తెలిపింది. దీంతో సహాయక చర్యలు చేపడుతున్న రక్షకులు, పౌరులు కూడా ఈ బాంబు దాడిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ దాడులను ఆఫ్ఘన్ వర్గాలు డబుల్-ట్యాప్ దాడిగా అభివర్ణించాయి. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ బహిరంగంగా స్పందించలేదు.
