Arjun Tendulkar: టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్–- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్ పెళ్లి చేసుకున్నాడు. యువ వ్యాపారవేత్త సానియా చందోక్ తో ఇవాళ అతడి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గతేడాది ఆగష్టులో అర్జున్-– సానియా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ వేడుక జరుగగా.. కొన్నిరోజుల తర్వాత సచిన్ టెండుల్కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. అయితే ఇటీవల అర్జున్–- సానియా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయి.
ఇక ముకేశ్ అంబానీ ఫ్యామిలీ జామ్ నగర్ లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేయగా, అనంత్ అంబానీ -– రాధికా మర్చంట్ పెళ్లి జరిగిన ప్రదేశంలోనే అర్జున్–- సానియాల వివాహ వేడుకలను స్టార్ట్ చేశారు. గణేషుడి ఆశీర్వాదంతో పాటు అంబానీ కుటుంబం వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీకి సచిన్ టెండుల్కర్ ధన్యవాదాలు చెప్పారు. కాబోయే కోడలి సానియాపై ప్రేమను కురిపించాడు. తన కుమారుడు అర్జున్.. అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని 'పార్ట్నర్' ఎంచుకున్నాడని పేర్కొన్నాడు. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.. జీవితాంతం ఇలాగే ఆనందంగా కలిసి ఉండాలని దీవించాడు.
పెళ్లి వేడుక ఈరోజు జరిగింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మేన్ రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. ఆమె కూడా ఓ ఎంటర్ప్రైన్యూర్ గా కొనసాగుతుంది. సచిన్ కుమార్తె సారా టెండుల్కర్, సానియా ఇద్దరు ప్రాణ స్నేహితురాలు. అర్జున్ టెండుల్కర్ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద ఈమె. ఇక అర్జున్ టెండుల్కర్– సానియా పెళ్లికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు, సురేశ్ రైనా దంపతులు, కపిల్ దేవ్ దంపతులు సహా భారత మాజీ క్రికెటర్లలో చాలా మంది సతీసమేతంగా విచ్చేశారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ పెళ్లి కోసం తరలివచ్చారు. వ్యాపార దిగ్గజం ముకేశ్- నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
