భయం గుప్పిట్లో పాలస్తీనా గ్రామాలు.. పౌరులపై దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ సెటిలర్లు

భయం గుప్పిట్లో పాలస్తీనా గ్రామాలు.. పౌరులపై దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ సెటిలర్లు

దుమా: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని పలు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. శనివారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆక్రమిత వెస్ట్​ బ్యాంక్ ప్రాంతంలోని పలు పాలస్తీనా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఆకాశంలో మిసైళ్లు, డ్రోన్‌‌‌‌లు పడుతుండగా.. మరోవైపు సొంత ప్రాంతంలోనే వారికి ఆరాచకాలు ఎదురవుతున్నాయి. 

అక్కడి ఇజ్రాయెల్ సెటిలర్లు (ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులు) పాలస్తీనా గ్రామాలపై దాడులు చేస్తున్నారు. వారికి ఇజ్రాయెల్ ఆర్మీ సహాయం చేస్తుండడంతో అక్కడి పౌరులు పాలస్తీయులపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దాడులు చేస్తూ హత్యలకు పాల్పుడుతున్నారు. ఇండ్లు కూల్చివేస్తూ.. ఆహారం- నీరు అందకుండా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తున్నారు.

 ప్రధానంగా దుమా, కర్యూట్, ముహమ్మద్, బస్సామ్ ఆరారా, ఐన్ అల్-రషాష్ తదితర గ్రామాల్లో ఇలాంటి ఘటను ఎక్కువగా జరుగుతున్నాయి. దుమాలో ఇరాన్ మిసైల్ శకలాలు ఒక ఇంటికి 20 మీటర్ల దూరంలో పడ్డాయి. గ్రామానికి చెందిన యువతి తహెత్ మొసల్లం మాట్లాడుతూ.. ‘‘ఆకాశంలోకి రాకెట్ల కన్నా సెటిలర్లు మా ఇంటి దగ్గరికి రావడమే మాకు పెద్ద ముప్పు. ఆర్మీ కూడా వారికే సహకరిస్తున్నది!" అని పేర్కొంది. అలాగే, కర్యూట్‌‌‌‌లో సోమవారం సెటిలర్లు ఇద్దరు పాలస్తీనా సోదరులను కాల్చి చంపారు. ఆదివారం ముహమ్మద్ గ్రామంలోకి చొరబడి 70 ఏండ్ల వృద్ధుడిపై దాడి చేశారు. 

పాలస్తీనీయన్లు ఎదిరించగా.. పెప్పర్ స్ప్రే కొట్టడం, కార్లు ధ్వంసం చేయడం, నీటి ట్యాంకులు ఖాళీ చేయడం వంటి అమానుష ఘటనలకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. సైనికులు వచ్చినా.. సెటిలర్లను ఆపలేదని, అందులో ఓ సైనికుడు పాలస్తీనీయులపైనే కాల్పులు జరిపాడని చెప్పారు. ‘‘ఇది మా భూమి. సెటిలర్లను మేము రక్షిస్తాం!”అని ఆ సైనికుడు పేర్కొన్నాడని వారు తెలిపారు. ఇరాన్ పై యుద్ధం ముసుగులో ఈ దాడులు తీవ్రమవుతున్నాయని వారు పేర్కొన్నారు. 2023 జూన్‌‌‌‌లో, అక్టోబర్ 7న కూడా హమాస్ దాడి తర్వాత ఇలాంటి ఘటనలే జరిగాయి.