ఇరాన్‌లో యుద్ధం ఆపేస్తా.. తర్వాతి టార్గెట్ క్యూబా: ట్రంప్

ఇరాన్‌లో యుద్ధం ఆపేస్తా.. తర్వాతి టార్గెట్ క్యూబా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన విదేశీ విధానంలో మరో సంచలన మార్పు గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడమే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూనే.. తర్వాతి టార్గెట్ 'క్యూబా' అని ప్రకటించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఆట ఇరాన్ వార్ తర్వాతే ఉండబోతోందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. 

ఇరాన్ తర్వాత క్యూబానే టార్గెట్:
ప్రస్తుతం ఇరాన్ ఘర్షణపైనే తమ పూర్తి దృష్టి ఉందని ట్రంప్ తెలిపారు. ముందు ఆ యుద్ధాన్ని ముగించనివ్వండి.. అది పూర్తయిన వెంటనే ఫోకస్ క్యూబాపై పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే క్యూబన్ అమెరికన్లు తిరిగి తమ ద్వీప దేశానికి వెళ్లే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒప్పందం కోసం క్యూబా ఆరాటం:
అమెరికాతో దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి క్యూబా ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఉందని ట్రంప్ వెల్లడించారు. క్యూబా ఒక ఒప్పందం కోసం ఎంతగానో తపిస్తోందని చెబుతూ.. భవిష్యత్తులో ఆ దేశంతో సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు. క్యూబన్ సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మేము మిమ్మల్ని తిరిగి చూడాలనుకుంటున్నాము, మిమ్మల్ని కోల్పోవడం మాకు ఇష్టం లేదు" అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇరాన్ యుద్ధంపై అప్డేట్:
ఇరాన్‌తో యుద్ధం అనుకున్నదానికంటే వేగంగా ముగుస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో శత్రువులను పూర్తిగా అణచివేస్తున్నామని, ఇరాన్ వాయుసేన, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల్లోనే 24 ఇరాన్ నౌకలను అమెరికా బలగాలు నాశనం చేశాయని వెల్లడించారు. ఇప్పుడు ఇరాన్ నాయకులే స్వయంగా కాల్ చేసి ఒప్పందం కోసం అడుగుతున్నారని.. అయితే ప్రస్తుతం చర్చల కంటే పోరాటానికే తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు.

స్థిరపడిన ఆయిల్ మార్కెట్:
యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రపంచ చమురు మార్కెట్ స్థిరంగానే ఉందని ట్రంప్ భరోసా ఇచ్చారు. చమురు ధరలపై ఒత్తిడి తగ్గించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని హింట్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం ముగియగానే అమెరికా విదేశీ విధానం వేగంగా క్యూబా వైపు మళ్లుతుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. వెనిజులాతో మెుదలైన ట్రంప్ దూకుడు క్యూబాతో అయినా ఎండ్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు నిపుణులు.