- ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్
- స్టబ్‌తో కలిసి జాయింట్ ప్రెస్‌మీట్
న్యూఢిల్లీ: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సైనిక సంఘర్షణ ఏ సమస్యనూ పరిష్కరించలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి గురువారం జాయింట్ ప్రెస్మీట్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం ప్రస్తుతం అస్థిరత, అనిశ్చితి దశలో ఉందన్నారు. ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు అనేక ప్రాంతాల్లో సంఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారతదేశం, ఫిన్లాండ్.. చట్టబద్ధమైన పాలన, చర్చలు, దౌత్యపరమైన మార్గాలపై విశ్వాసం కలిగి ఉన్నాయని మోదీ చెప్పారు. ‘‘అది ఉక్రెయిన్ కావచ్చు లేదా పశ్చిమాసియా కావచ్చు.. ఏ సమస్యనైనా సైనిక సంఘర్షణ ద్వారా పరిష్కరించలేమని మేము ఇద్దరం ఒప్పుకుంటున్నాం. ప్రపంచ సంస్థలకు తక్షణ సంస్కరణలు అవసరమని మేము నమ్ముతున్నాం" అని ప్రధాని పేర్కొన్నారు.
అమెరికా, -ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమైన మిసైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిన్లాండ్ అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో భారత్, -యూరప్ మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నాయని చెప్పారు. ఇటీవల సంతకం చేసిన భారత్, -యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారతదేశం, -ఫిన్లాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాన్ని పెంచుకోవడమే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు.
