భారత్, చైనాలే టార్గెట్.. రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేటర్ కామెంట్

భారత్, చైనాలే టార్గెట్.. రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేటర్ కామెంట్
  • భారీ మెజార్టీతో బిల్లును పాస్ చేసిన సెనేట్
  • 100% టారిఫ్‌‌‌‌లు విధించేలా ట్రంప్‌‌‌‌కు అధికారం!

వాషింగ్టన్‌‌‌‌: రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు తీసుకొచ్చిన ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న దేశాలను.. ముఖ్యంగా భారత్, చైనాలను టార్గెట్ చేసి ఈ బిల్లును రూపొందించినట్లు  సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ రోజర్ విక్కర్ తెలిపారు. తమ మిత్ర దేశాలకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడ్డామని వివరించారు. ఈమేరకు ఆయన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. 

‘‘భారత్, చైనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లును చాలా జాగ్రత్తగా రూపొందించాం. రష్యా ఇంధనాన్ని విచ్చలవిడిగా కొంటూ పుతిన్ యుద్ధ యంత్రాంగానికి వారే నిధులు సమకూరుస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా వారు మనకు అనుకూలంగా వ్యూహాత్మక లబ్ధి చేకూర్చడం లేదు” అని విక్కర్ పేర్కొన్నారు.

సెనేట్​ లో బిల్లుకు ఆమోదం

రష్యా ఇంధన ఆదాయాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెచ్చిన ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్‌‌‌‌ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’’ బిల్లు అమెరికా సెనేట్‌‌‌‌లో తొలి అడ్డంకిని దాటింది. సెనేట్‌‌‌‌లో జరిగిన ఓటింగ్‌‌‌‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 86 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 12 ఓట్లు వచ్చాయి. సెనేట్‌‌‌‌లో ప్రాథమిక ఆమోదం లభించినప్పటికీ, ఈ బిల్లు వెంటనే చట్టంగా మారిపోదు. మరోసారి తుది ఓటింగ్ నిర్వహిస్తారు. 

ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా దీనికి ఆమోదముద్ర వేయాలి. చివరిగా అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. బిల్లు ఆమోదం పొందినా భారత్, చైనాలపై 100 శాతం సుంకాలు ఆటోమేటిక్‌‌‌‌గా పడవు. దేశాల వైఖరిని బట్టి 
ఆ సుంకాలు విధించాలా? వద్దా? అనేది అధ్యక్షుడి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.

బిల్లులోని ప్రధానాంశాలివే..

  • రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం కొనసాగించే దేశాల ఉత్పత్తులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌‌‌‌లు విధించే సర్వాధికారాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌కు లభిస్తాయి.
  • అంతర్జాతీయ ఆంక్షలను పక్కకుపెట్టి రష్యా చమురును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న ‘షాడో ఫ్లీట్’ నౌకలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తారు.
  • రష్యాకు చెందిన ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలతోపాటు ఆ దేశపు ఆస్తిపరులైన ‘ఒలిగార్క్’లపై ఆంక్షలను కఠినతరం చేస్తారు. రష్యా యుద్ధ నిధులను 
  • కట్టడి చేసే క్రమంలో అక్కడి ప్రధాన బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థల లావాదేవీలపై కఠిన నిబంధనలు విధించనున్నారు.