కీవ్: ఉక్రెయిన్ బందీలు, యుద్ధ ఖైదీలపై రష్యా సైనికులు లైగింక హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. రష్యా ఆధీనంలో ఉన్న బందీలపై అత్యాచారాలు, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడులు చేస్తూ చిత్రహింసలు పెడుతున్నారని తెలిసింది. ఈ విషయాలన్నీ యునైటెడ్ నేషన్స్(యూఎన్) చేపట్టిన దర్యాప్తులో తేలాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టును ప్రచురించింది.
బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే రష్యన్ దళాల ఆకృత్యాలు బయటపడినట్లు ఆ రిపోర్టు పేర్కొంది. 2022లో ఉక్రెయిన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచే రష్యా ఈ తరహా దారుణాలు కొనసాగిస్తోందని చెప్పింది.
మానసికంగా కుంగదీసేందుకే..
రష్యా బలగాలకు 2022లో చిక్కిన ఉక్రెయిన్‌కు చెందిన సెర్హీ బోయ్‌చుక్ అనే మాజీ ఖైదీ తనపై జరిగిన దారుణాలను వివరించారు. రష్యా నిర్బంధంలో ఉన్న రెండేండ్లలో తనను తీవ్రంగా కొట్టారని, సీసాలు.. కర్రలతో లైంగికంగా హింసించారని చెప్పారు.
2024 అక్టోబర్‌లో ఖైదీల మార్పిడి ఒప్పందం కింద విడుదలైన ఆయన.. సైన్యంలో ఉన్నవాళ్లను మానసికంగా కుంగదీసే ఉద్దేశంతోనే రష్యన్ దళాలు లైంగిక దాడులు చేశాయని పేర్కొన్నారు. ఇంకొందరు మాజీ యుద్ధ ఖైదీలు కూడా ఇలాంటి అనుభవాలనే వెల్లడించారు.
మగవాళ్లే టార్గెట్‌గా అత్యాచారాలు..
బందీలుగా చిక్కిన మగ సైనికులే లక్ష్యంగా రష్యన్ దళాలు లైంగికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు యూఎన్ దర్యాప్తు ఆధారంగా తెలిసిందని రిపోర్టు పేర్కొంది. 310 లైంగిక హింస కేసుల్లో 280 మంది బాధితులు మగవాళ్లు, 26 మంది ఆడవాళ్లు, నలుగురు అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించింది.
బాధితుల వాంగ్మూలాల ప్రకారం రష్యా సైనికులు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను నగ్నంగా నిల్చోబెట్టడం.. ఆపై ఊరేగించడం, ప్రైవేట్ పార్ట్స్‌కు కరెంటు షాక్ ఇవ్వడం.. తీవ్రంగా గాయపర్చడం, అత్యాచారాలకు పాల్పడటం వంటి అమానుష చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, ఈ ఆరోపణలపై రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.
