కిచెన్ తెలంగాణ : క్యాబేజీతో హెల్దీ శ్నాక్స్.. టేస్ట్ అదిరిపోద్ది..ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు

కిచెన్ తెలంగాణ :  క్యాబేజీతో హెల్దీ శ్నాక్స్.. టేస్ట్ అదిరిపోద్ది..ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు

మోమో.. స్టీమ్డ్​ కేక్.. కట్ లెట్​..  ఈ మూడు ఐటెమ్స్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వీటి​ని రకరకాల వెజిటబుల్స్​తో తయారుచేసుకోవచ్చు. వీటిని చేసే పద్ధతి కూడా చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి పొట్టకు హాయిగా ఉంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేస్తాయి ఈ రెసిపీలు. ఎంతో టేస్టీగా ఉండే ఈ త్రీ ఐటెమ్స్​ను క్యాబేజీతో ఎలా చేసుకోవాలో చూసేయండి. 

 క్యాబేజీతో స్టీమ్ కేక్ తయారీకి  కావాల్సినవి

  • క్యాబేజీ తురుము, శనగపిండి – ఒక్కో కప్పు
  • పచ్చిమిర్చి – రెండు
  • వెల్లుల్లి రెబ్బలు – ఆరు
  • అల్లం – చిన్న ముక్క
  • ధనియాలు – ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర – ఒక టీస్పూన్
  • ఉల్లిగడ్డ – ఒకటి 
  • కొత్తిమీర – అర కప్పు
  • కారం – అర టీస్పూన్
  • నూనె – రెండు టీస్పూన్లు
  • తాలింపు దినుసులు
  • ఉప్పు – సరిపడా 
  •  కరివేపాకు – కొంచెం

తయారీ  విధానం : పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర, ఉప్పు, కారం, శనగపిండి వేసి, నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి.  ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్​లో సమాంతరంగా పరిచి, ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్​ చేయాలి. ఆ తర్వాత ఒక పాన్​లో నూనె వేడి చేసి తాలింపు దినుసులు, కరివేపాకు వేసి వేగించాలి. అందులో స్టీమ్డ్ క్యాబేజీ ముక్కలు కూడా వేసి వేగించాలి. 

 క్యాబేజీతో  కట్ లెట్​ తయారీకి కావాల్సినవి 

  • క్యాబేజీ – 750 గ్రాములు
  • కోడిగుడ్లు, ఉల్లిగడ్డలు – రెండేసి చొప్పున
  • బొంబాయి రవ్వ – ముప్పావు కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు – మూడు
  • కొత్తిమీర – కొంచెం
  • నూనె, ఉప్పు – సరిపడా
  • మిరియాల పొడి – అర టీస్పూన్

తయారీ విధానం : క్యాబేజీ తరుగును వేడి నీళ్లలో వేసి కాసేపు ఉడికించాలి. తర్వాత నీటిని వడకట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, వెల్లుల్లి తురుము వేసి వేగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో క్యాబేజీ తరుగు, కోడిగుడ్ల సొన, బొంబాయి రవ్వ, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మూతపెట్టి పదినిమిషాలు పక్కన ఉంచాలి. ఆపై కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చిన్న సైజు కట్​లెట్​లా చేయాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి అందులో ఈ కట్​లెట్​లను పెట్టి రెండు వైపులా కాల్చాలి. 

 క్యాబేజీతో  మోమో తయారీకి  కావాల్సినవి 

  • నూనె – మూడు టీస్పూన్లు
  • టొమాటో కెచెప్, వెల్లుల్లి, అల్లం తరుగు – ఒక్కో టేబుల్ స్పూన్
  •  ఉల్లిగడ్డ తరుగు – అరకప్పు
  • క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్​, ఉల్లికాడలు తరుగు – ఒక్కోటి పావు కప్పు
  • పచ్చిమిర్చి – ఒకటి
  • పనీర్ తురుము – 200గ్రాములు
  •  ఉప్పు – సరిపడా
  • మిరియాల పొడి
  • రెడ్ చిల్లీసాస్, సోయాసాస్ – ఒక్కో టీస్పూన్

తయారీ  విధానం : పాన్​లో నూనె వేడి చేసి వెల్లుల్లి, అల్లం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్, క్యాబేజీ తురుము ఒక్కోటిగా వేసి వేగించాలి.  తర్వాత పనీర్​ తురుము, క్యాప్సికమ్​, ఉల్లికాడల తరుగు వేసి కలపాలి. మిరియాల పొడి, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. అందులో క్యాబేజీ ఆకులు వేసి 8–10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆ ఆకుల్లో రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టి కవర్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి క్యాబేజీ మోమోలను పెట్టి రెండు వైపులా కాల్చాలి.