
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం నుంచి ‘కియోస్క్’ యంత్రాలు అందుబాటులోకి రాగా.. వీటిద్వారా భక్తులకు అందించే సేవలు మరింత సులభతరమవుతాయని ఆలయ ఈఓ వెంకట్ రావు పేర్కొన్నారు. ఆలయానికి కెనరా బ్యాంక్ విరాళంగా ఇచ్చిన రూ.10 లక్షల విలువైన ఆరు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రసాద విభాగంలో మూడు యూనిట్లు, అద్దె గదులు, డోనర్ సెల్, వ్రత మండపంలో ఒక్కో యూనిట్ చొప్పున ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రాల పనితీరును ఈఓ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ వెంకటరావు మాట్లాడుతూ.. కియోస్క్ యంత్రాల వినియోగం వల్ల భక్తులు దర్శన టికెట్లు, వ్రత టికెట్లు, ప్రసాదం టికెట్లతో పాటు ఆలయంలో నిర్వహించే అన్ని రకాల పూజలు, కైంకర్యాలకు సంబంధించిన టికెట్లను డిజిటల్ పేమెంట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. తద్వారా భక్తులు ఆయా టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లు, కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం తప్పుతుందన్నారు. ఆలయానికి కియోస్క్ యంత్రాలను విరాళంగా ఇచ్చిన కెనరా బ్యాంక్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కర్ శర్మ, ఏఈవో జూషెట్టి కృష్ణ గౌడ్, ఆలయ అధికారి అశ్వినీ, కెనరా బ్యాంక్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.