ఎండాకాలం మొదలైందంటే చాలు.. సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం కోసం సామాన్యుడి నుంచి రిచ్ పీపుల్ వరకు అందరూ ఏసీలు, కూలర్ల వైపు చూస్తుంటారు. అయితే ఈ వేసవిలో కొత్తగా ఏసీలు, కూలర్లు కొనాలనుకునే వారికి పెద్ద షాక్ తగలబోతోంది. మార్కెట్‌లో ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. గడచిన ఏడాది కాలంలో విపరీతంగా పెరిగిన వెండి రేట్లే దీనికి కారణం.
ఏసీలలో ఉండే కాయిల్స్, వైరింగ్, ఇతర భాగాల తయారీలో రాగిని ఎక్కువ మెుత్తంలో ఉపయోగిస్తారు. గత ఏడాది కాలంలో రాగి ధరలు దాదాపు 60 శాతం పెరిగాయి. గ్లోబల్ మార్కెట్‌లో టన్ను రాగి ధర దాదాపు 12వేల డాలర్లకు చేరుకుంది. దేశీయ మార్కెట్‌లో కూడా కిలో రాగి ధర రూ.1,307 నుండి రూ.1,330 వరకు పలుకుతోంది. ఇది ఆల్-టైమ్ రికార్డ్ స్థాయికి చేరువలో ఉండటం గమనార్హం. ఉత్పత్తి ఖర్చులు 8 నుండి 10 శాతం వరకు పెరగడంతో ఆ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పని పరిస్థితి కంపెనీలకు ఏర్పడింది.
దీంతో ఈ సమ్మర్ నాటికి ఏసీల రేట్లు 7 నుండి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు కొనే ఏసీల రేట్లు సగటున రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పెరగొచ్చు. వోల్టాస్, హావెల్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, పాలీక్యాబ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఒక్క ఏసీలు మాత్రమే కాదు.. రాగిని ఎక్కువగా వాడి తయారు చేసే కూలర్లు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు కూడా పెరిగిపోనున్నాయి.
రేట్లు పెరగడానికి కారణాలేంటి..?
రాగి ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు పెరగడం. రెండోది ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి వినియోగం ఎక్కువగా ఉండటం. ఇక చివరిగా మూడోది.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం రోజురోజుకూ పెరిగిపోతుండటం. వీటన్నింటికీ తోడు చిలీ, ఇండోనేషియా వంటి ప్రధాన రాగి ఉత్పత్తి దేశాల్లో సరఫరా సమస్యలు తలెత్తడంతో రేట్లకు రెక్కలు వచ్చాయి. ఈ కారణాలతో రానున్న వేసవిలో చల్లదనం కావాలంటే జేబుకు చిల్లు పడక తప్పదని తేలిపోయింది.
