హైదరాబాద్: మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తలసానిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రవికిరణ్ కంప్లైంట్ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు తలసానిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలు వివాదం ఏంటంటే..?
ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన పేరుతో సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. తలసాని కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసాని బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తలసాని వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడంతో తలసాని వెనక్కి తగ్గారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం ఆవేశంలో అలా మాట్లాడానని.. అందులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను తాను గౌరవిస్తానని అన్నారు.
