యాదగిరిగుట్ట, వెలుగు: క్రీడల్లో రాణించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తద్వారా భవిష్యత్తు బంగారుమయం అవుతుందని యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బైండ్ల సూర్యకళ రాములు స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడలతో ఫిట్ నెస్ మెరుగవడమే కాకుండా అనారోగ్యమనేది దరిచేరదని పేర్కొన్నారు.
క్రీడల్లో ఉన్నతంగా రాణిస్తే గుర్తింపుతో పాటు ఆర్థికంగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా మక్కువ పెంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఫైనల్ లో గెలిచిన యాదగిరిగుట్ట పోలీస్ టీంకు రూ.25,116 నగదుతో పాటు కప్పును అందజేశారు. రన్నరప్ గా నిలిచిన కేసరి యూత్ జట్టుకు రూ.15,116 నగదు పురస్కారంతో పాటు కప్పు ప్రదానం చేశారు.
టోర్నమెంట్ కు స్పాన్సర్ గా వ్యవహరించిన గ్రామస్తుడు ఒగ్గు రాణాప్రతాప్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వంగపల్లి గ్రామ సర్పంచ్ ఒగ్గు రవళి రాణాప్రతాప్, ఉప సర్పంచ్ చిన్నం మల్లయ్య, కేసరి యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, ఉపాధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి నగేష్, వార్డు సభ్యులు కానుగు రాజీవ్, వినోద్, కేసరి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
