రాష్ట్రంలో 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్ వంటి కీలక ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా పెండింగులో పెట్టడం వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఉద్యోగ జీవితమంతా క్రమశిక్షణతో విధులు నిర్వహించి, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైరైన తర్వాత వారికి ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ, ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.
చేతిలో డబ్బులు లేక, అత్యవసర వైద్యం చేయించుకోలేక దీర్ఘకాలిక వ్యాధులతో ఇప్పటికే రాష్ట్రంలో 61మంది పెన్షనర్లు మరణించారు. ఈ గణాంకాలు పరిపాలనా లోపాల తీవ్రతను ప్రతిబింబిస్తున్న విషాద సంఘటనలు. రాష్ట్రంలో పాలకులు మారినా, పెన్షనర్ల పరిస్థితిలో మార్పు రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలు కొత్త ప్రభుత్వంలో సైతం అలాగే కొనసాగుతున్నాయి.
బెనిఫిట్స్ పెన్షనర్ల హక్కు
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావు. అవి ఉద్యోగి తన సర్వీసులో అందించిన సేవలకు ప్రతిఫలంగా సంపాదించిన హక్కులు. వాటిని సమయానికి చెల్లించకపోవడం అంటే వారి హక్కులను కాలరాయడమే. ప్రభు త్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నది వాస్తవమే.
అయితే, ఇతర ఖర్చులను తగ్గించైనా ముందుగా పెన్షనర్లకు చెల్లించాలి. ఇతర పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు సర్దుబాటు చేస్తున్న ప్రభుత్వం, పెన్షనర్లకు మాత్రం డబ్బులు లేవనడం సమర్థనీయం కాదు. రిటైరైన తర్వాత ఉద్యోగులు పూర్తిగా పెన్షనరీ బెనిఫిట్స్‌పైనే ఆధారపడతారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జరుగుతున్న విపరీత జాప్యం వల్ల పెన్షనర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
నెలకు రూ.1500 కోట్లు ఇవ్వాలి
రాష్ట్రంలో 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లలో ప్రధానంగా డెత్ కం రిటైర్మెంట్ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్ మొదలైనవి సుమారు రూ.10,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వం గత జూన్ నుంచి ప్రతినెలా రూ.700 కోట్లను మాత్రమే విడుదల చేస్తోంది. ప్రతి నెలా వందలాది మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. 2024 నుంచి రిటైరైన వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్‌తో పాటు రిటైర్మెంట్ జాబితాలో కొత్తగా చేరుతున్న వారికి చెల్లించాల్సిన మొత్తం కలిపిబకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి.
పైగా, ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న ఈ మొత్తం నుంచే సర్వీసులో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగు బిల్లులను సైతం క్లియర్ చేస్తున్నారు. దీనివలన పెన్షనర్లకు ఊరట దక్కడం లేదు. బెనిఫిట్స్ మంజూరులో విపరీత జాప్యం జరుగుతున్న కారణంగా అనేక మంది పెన్షనర్లు అప్పుల పాలవుతున్నారు. నెలకు రూ.700 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి సుమారు రూ.8,400 కోట్లు మాత్రమే విడుదల చేస్తే, కొత్త పెన్షనర్లు చేరుతున్న నేపథ్యంలో ఆ నిధులు ఎలా సరిపోతాయి? నిధులను పెంచకపోతే పెండింగ్ బిల్లులు తగ్గే అవకాశమే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలవారీ నిధులను కనీసం రూ.1500 కోట్లకు పెంచితేనే పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
సీఎం, డిప్యూటీ సీఎం చొరవ చూపాలి
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశాన్ని కేవలం ఆర్థిక లెక్కల కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల విషయాన్ని సానుభూతితో చూడాలి. స్పష్టమైన టైమ్‌లైన్‌తో పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలి.
నెలవారీ గ్రాంటుని రూ.1500 కోట్లకు పెంచాలి. ఆ మొత్తాన్ని కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకే వినియోగించాలి. అవసరమైతే బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు తగ్గించి పెన్షనర్లను ఆదుకోవాలి. ఈ నిర్ణయాలు సత్వరం తీసుకుంటేనే పెన్షనర్లలో ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పెన్షనర్లు చనిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలి. పెన్షనర్లు అడుగుతున్నది అదనపు ప్రయోజనాలు కాదు, తమకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులే.
మానేటి ప్రతాపరెడ్డి గౌరవాధ్యక్షుడు, టీఆర్‌టీఎఫ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
