- యాత్రలో 60 మంది థాయిలాండ్ భిక్షువులు
- నేడు బుద్ధ వనంలో ‘బుద్దుడితో నా ప్రయాణం’ నాటకం
నల్గొండ, వెలుగు: భారతదేశంలో బౌద్దాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో చేపట్టిన దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్ లోని బౌద్ద వనానికి చేరుకుంది. 60 మంది థాయ్‌లాండ్ బౌద్ద భిక్షువులు, వారితో పాటు మరో 10 మంది భారతీయ బౌద్ధులు, ఉపాసకులు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘బుద్ద దమ్మ పాదయాత్ర’ చేపట్టారు. గత నెల 2న కర్నాటకలోని గుల్బర్గాలోని సిద్ధార్థ బుద్ద విహార్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 450 కిలోమీటర్లు కొనసాగి ఆదివారం నాగార్జునసాగర్ లోని బుద్ధ వనానికి చేరుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సంగ ప్రాజెక్ట్ డైరెక్టర్ సోంగ్‌శాక్ కోవిడో నాయకత్వంలో ముంబైకు చెందిన బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ సమన్వయంతో యాత్ర సాగింది.
మూడు రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
నాగార్జునసాగర్ బుద్ధ వనంలో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటకం ప్రదర్శించనుండగా, 400 మంది బౌద్ద భిక్షువులు పాల్గొననున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అక్షయ ఫౌండేషన్ అధ్యక్షులు సిద్ధార్థ, మంత్రి వివేక్ వెంకటస్వామి, గుల్బర్గా సిద్ధార్థ బుద్ద విహార సంస్థలు, గగన్ మాలిక్ ఫౌండేషన్ సంస్థ దమ్మయాత్రకు నాయకత్వం వహించనున్నారు.
