న్యూఢిల్లీ, వెలుగు: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల కోసం 9 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పెద్దల సభకు వెళ్లనున్నారు. ఆయనతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 8 మంది అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. బిహార్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు శివేష్ కుమార్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది.
అస్సాం నుంచి తారేష్ గోవాలా, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా నామినేట్ అయ్యారు. ఎలక్షన్ కమిష్ ఆఫ్ ఇండియా ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
పది రాష్ట్రాల్లో మొత్తం 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 5న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, మార్చి 15న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ 9 స్థానాలకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి స్పష్టంగా ఉండటంతో అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. బిహార్‌లో సమీకరణాలు..
బిహార్‌కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. వీరిలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ప్రేమ్‌చంద్ గుప్తా, కేంద్ర మంత్రులు రామ్‌నాథ్ ఠాకూర్, అమరేంద్ర ధరి సింగ్, అలాగే ఉపేంద్ర కుష్వాహ ఉన్నారు. ప్రస్తుతం జేడీయూ తరఫున హరివంశ్ నారాయణ్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్, ఆర్జేడీ తరఫున ప్రేమ్‌చంద్ గుప్తా, అమరేంద్ర ధరి సింగ్, రాష్ట్రీయ లోక్ మోర్చా తరఫున ఉపేంద్ర కుష్వాహా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఎన్డీఏ ఐదు స్థానాల్లో నాలుగు గెలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదో స్థానానికి అదనంగా ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. జేడీయూకు ప్రస్తుతం రెండు స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల వారీగా రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ప్రకటించిన అభ్యర్థుల విజయం దాదాపు ఖాయమని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అభ్యర్థుల వివరాలు..
నితిన్ నబీన్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిహార్‌లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బంకిపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
శివేష్ కుమార్: బిహార్‌లోని అజియోన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే.
సంజయ్ భాటియా: హర్యానాలోని కర్నాల్ లోక్‌సభ స్థానం నుంచి 2019–2024 మధ్య ఎంపీగా పనిచేశారు.
జోగెన్ మోహన్: అస్సాంలో హిమంత బిశ్వా శర్మ ప్రభుత్వంలో రవాణా, హిల్ ఏరియాస్ డెవలప్‌మెంట్, సహకార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తారేష్ గోవాలా: అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లా దులియాజన్ నియోజకవర్గం ఎమ్మెల్యే.
రాహుల్ సిన్హా: పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు.
లక్ష్మీ వర్మ: ఛత్తీస్‌గఢ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, సీనియర్ మహిళా నేత.
సుజీత్ కుమార్: గతంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) తరఫున రాజ్యసభ సభ్యుడు. 2024లో ఆ పార్టీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
మన్మోహన్ సామల్: ఒడిశాలో బీజేపీ రాష్ట్ర స్థాయి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
