ఒకప్పుడు సుమారు 12 రాష్ట్రాల్లో నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న నక్సల్స్ ఉద్యమం ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాల్లో మాత్రమే ప్రభావితంగా ఉండి, అనేక కారణాలవల్ల బలహీనపడుతూ వచ్చింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ముందు, చత్తీస్గఢ్ప్రభుత్వం ముందు, తెలంగాణ ప్రభుత్వం ముందు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొందరు అగ్రనేతలు ఇటీవలనే లొంగిపోయారు.
మల్లోజుల.. దేవ్ జీ..లాంటి పెద్ద నేతలు కూడా అందులో ఉన్నారు. కొందరు ఈ మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమకు సరైన ప్యాకేజీ మొదలైనవి ఇచ్చి స్థిరపడేటట్టు చేయాలని కోరారు. ఎందుకో తెలియదు తెలుగు మీడియా ఇటీవల లొంగిపోయిన దేవ్ జీ మొదలైనవారి గురించి గొప్పగానే చూపిస్తూ ఉంది. గతంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వివిధ పార్టీలలో పనిచేస్తున్న వ్యక్తుల జీవితం ప్రభావం అంత గొప్పగా ఏమీ లేదు.
ఆయుధాలు పట్టుకున్నవాళ్లేమో ఒకవైపు లొంగిపోతున్న తంతు నడుస్తూ ఉంటే, గాదె ఇన్నయ్య లాంటివాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడి జైలుకు వెళ్లడం మరొక ప్రహసనం. కొందరు విద్యావేత్తలుగా, కవులుగా, కళాకారులుగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయి పదవులు పొందిన వ్యక్తులుగా చలామణి అవుతూ ఉన్నారు. వీళ్లు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటారు. అన్నలే ఇప్పుడు పట్టణాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నారు. కొందరు వాళ్లను పార్టీలు పెట్టమని కోరుతున్నారు. మరికొందరు వివిధ పార్టీలలో పని చేయమని కోరుతున్నారు. ఇదంతా సంభవమేనా?
కాంగ్రెస్ పార్టీ ఏమేరకు ఆమోద యోగ్యం ?
కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా, ఆమోదయోగ్యమైన పార్టీగా మావోయిస్టులకు కనిపించవచ్చు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ‘ఉపా’ తెచ్చింది. ఎన్నో సంస్థలను ప్రజా సంఘాలపై నిషేధం విధించింది. ఎందరో ఎన్కౌంటర్లో చంపేయబడ్డారు. జలగం వెంగళరావు మొదలుకొని వైయస్ రాజశేఖర్ రెడ్డి వరకు ఆ పని నిరంతరం కొనసాగింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలాగ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాడు. కేంద్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు కష్టంగా ఉంది కాబట్టి, ఇక్కడ మెరుస్తున్న ఈ మాత్రం మెరుపు కాంగ్రెస్ పార్టీకి అదృష్టమే. గత పది ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం విపరీత ధోరణి తర్వాత వచ్చిన ఫలితాలు వేరు. రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. అందులో కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రాలు ఎక్కువ.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మావోయిస్టు భావజాలాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ రాజ్యం చేద్దామని అంటే, బీజేపీ వేగంగా ఇక్కడ పుంజుకుంటుంది. నిజానికి నక్సలైట్ విద్యార్థి సంఘాలు, రాడికల్ విద్యార్థి సంఘాల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నదంతా ఏబీవీపీ కార్యకర్తలే. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆజన్మాంతం పోరాటం చేసిన మావోయిస్టులు ఇప్పుడు తమకు తాము ఎలా సర్ది చెప్పుకుంటారన్న ఒక మీమాంస తలెత్తుతుంది. ముఖ్యంగా సల్వాజుడుం లాంటిది స్థాపించిన మహేంద్ర కర్మ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. ఆయన ప్రాణం కూడా నరసరాయుళ్ల చేతుల్లోనే పోయింది. మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు కూడా మావోయిస్టుల చేతుల్లో మరణించారు.
బీఆర్ఎస్ పొసగని పార్టీ ?
అన్నలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి అది సగం లెఫ్ట్, సగం రైట్. చెరుకు సుధాకర్ లాంటి ఎంతో మంది వెళ్లి చేతులు కాల్చుకున్న సందర్భం ఉంది. సాంబశివుడులాంటి వ్యక్తి హత్య కూడా గతంలో జరిగింది. ఈ ధూంధాం బ్యాచ్ అంతా ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. అది కుటుంబ పార్టీ కావడం వల్ల మావోయిస్టులు కోరుకునే గతితార్కిక భౌతిక వాదానికి అక్కడ స్థానం ఉంటుందని అనుకోవడం లేదు. అక్కడ వెళ్లి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రయత్నించి విఫలమైన వాళ్ళందరూ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు.
అలాంటిది మావో మార్గంలో నడిచిన ఈ లొంగిపోయిన సైనికులు వెళ్లి మాట్లాడితే అక్కడ విలువ ఉంటుందని చెప్పడానికి లేదు. ఫక్తు రాజకీయ పార్టీ వ్యక్తిలా వ్యవహరించే కార్యకర్తలకు మాత్రమే ప్రాంతీయ పార్టీలలో విలువ ఉంటుంది. అదీకాక బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ. అందులో ఇముడుతారో లేదో కాలమే తేల్చాలి.
కమ్యూనిస్టు పార్టీలు ఒకే గొడుగు కిందకి రాలేవు!
కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతపరంగా సీపీఐ, సీపీఎంగా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తూ పనిచేస్తూ ఉన్నది. సీపీఎం తెలంగాణ వచ్చిన తర్వాత కనుమరుగు దశలో ఉంటే, సీపీఐ కొంత బ్యాటింగ్ బాగానే చేస్తూ ఉన్నది. మావోయిస్టులకు, కమ్యూనిస్టు పార్టీలకు సైద్ధాంతికం గా సూక్ష్మ విభేదాలు ఉన్నాయి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే కమ్యూనిస్టులు ఒకే గొడుగు కిందికిరారు అన్న విమర్శ ఉంది. గతంలో ఖమ్మం జిల్లాలో సీపీఐ, సీపీఎంలు హత్యా రాజకీయాల్లో కూడా పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. బెంగాల్లో మావోయిస్టులకు,కమ్యూనిస్టు పార్టీకి ఎంతో పెద్ద సంఘర్షణ జరిగింది.
ఆయుధం ధరించిన వాళ్ళు...!
ఇన్నాళ్లు అడవుల్లో అష్టకష్టాలు పడి ఆయుధం ధరించి తిరిగినవాళ్ళు ఇక్కడి సమాజంలోకి వచ్చి, ఇక్కడున్న ఈ ఎక్కువ, తక్కువలను భరిస్తూ ఉండగలరా? గతంలో కొందరు లొంగిపోయిన మావోయిస్టులు చేసినట్టుగా సెటిల్మెంట్లు, భూదందాలు, రాజకీయ జోక్యాలు ఇవన్నీ వస్తే మన సమాజం భరించగలుగుతుందా?
ఆపరేషన్ కగారనేది యుద్ధమే గానీ, వీళ్ళకిచ్చిన ఆప్షన్ కాదు. మావోయిజం అనేది ఎప్పటికీ చావదు అని కూడా కొందరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పాండవులు ఆయుధాలు వదిలిపెట్టి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశాక వచ్చి చేసింది యుద్ధమే. ఇక్కడ అలాంటి యుద్ధానికి తావులేదు కాబట్టి ఆయుధాలను ఉపయోగించి వ్యవస్థలను ప్రభావితం చేయడం మొదలుపెడితే ఏం జరుగుతుందో నయీమ్ లాంటి వాళ్లను ఉదాహరణగా చూశారు.
చేతిలో తుపాకీ లేకపోవచ్చు కానీ వ్యూహం నిశ్శబ్దంగా ఉండనిస్తుందా? సిద్ధాంతం చేతులు ముడుచుకోమని చెబుతుందా? ఇవి ఇవాల్టి ప్రశ్నలు. ప్రభుత్వాలు లొంగిపొమ్మని కోరుతున్నాయి సరేగాని.. దానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా ఇప్పటివరకు కనిపించడం లేదు.
కమ్యూనిస్టు పార్టీ.. రష్యా, చైనాలో అవలంబించిన విధానాలు ప్రపంచం మొత్తం చూసింది. చివరకు కమ్యూనిస్టు పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్లు స్వచ్ఛంద పరిశోధకులు ఆ సిద్ధాంతం మీద అనేక పుస్తకాలు రచించారు. సైద్ధాంతికంగా బాగా ఉన్నప్పటికీ ఆచరణలో పెద్ద పొరపాటు జరుగుతుందన్నది వాళ్ళు తేల్చారు. ఆ సిద్ధాంతం కొన్ని దేశాలలో ఫలవంతం కాగా, మనలాంటి దేశంలో ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన లెఫ్ట్ వింగ్.. పిడివాదుల మాదిరిగా ముందుకు పరిగెత్తారు.
ఇరువైపులా ప్రాణాలు బలితీసుకున్న 70 ఏళ్ల రక్త చరిత్ర
1967లో చారు మజుందార్ ‘మావో మా చైర్మన్’ అని చైనా సాంస్కృతిక విప్లవం మాకు ఆదర్శం అని ప్రకటన చేసి రూపొందించిన ఈ సిద్ధాంతం మొత్తం దేశంలో ఎందరినో బలి తీసుకున్నది. ప్రస్తుతం పరిగెత్తి, పరిగెత్తి అలసిపోయి కాడి కింద పడేసి మళ్లీ ప్రజాస్వామ్యం అంటున్నది. మరి ఇప్పుడు ఈ బలి అయినవాళ్లను, వాళ్ళ కుటుంబాలను ఎవరు ఓదారుస్తారు? వాళ్ల జీవితాలకు విలువ లేదా! ఇప్పటికీ మేధావుల పేరుతో చేస్తున్న నయ వంచన ఎంతవరకు సబబు.. మరోవైపు సిద్ధాంతమే ఊపిరిగా తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టినవాళ్లు ఉన్నారు.
నక్సల్స్‌కు ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. సిద్ధాంతాలు అర్థం చేసుకోకుండా అపరిపక్వంగా చేసే ప్రయాణం ఎంత ప్రమాదమో సుమారు 70 ఏళ్ల రక్త చరిత్రను చూస్తే అర్థమవుతుంది. మళ్లీ ఇప్పుడు లొంగిపోతున్నవాళ్లకు పాలకవర్గాలు ఇప్పటికైనా సరైన దిశ, దశ ఇవ్వాలి, చూపాలి. అలా ఇవ్వకుంటే సమాజం మరొక సంక్షోభం ఎదుర్కోవడం ఖాయం.
ప్రత్యామ్నాయం కలలు !
బీజేపీ పార్టీకి మావోయిస్టులకు మధ్య సైద్ధాంతిక విభేదం ఉంది కాబట్టి అంత సులభంగా అటువైపు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. మావో పాఠశాలలో చదువుకున్నవాళ్ళు డాక్టర్ జీ పాఠశాలలో చదవడం సాధ్యపడదు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఆవేదనకు గురైన చాలామంది వ్యక్తులు రోజువారీగా గతంలో కేసీఆర్‌ను, ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించే బ్యాచ్ సోషల్ మీడియా పేరుతో, మేధావుల పేరుతో, ప్రజాసంఘాల పేరుతో సజీవంగా ఉన్నారు. మరోవైపు బీసీ పార్టీలు, బీసీ ఉద్యమాలు నడిపే సంస్థలు ఉన్నాయి. ఈ మూడు ప్రధాన పార్టీలు కాకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను తెలంగాణలో తేవాలన్న ఆలోచన చాలామందిలో ఉంది.
ఏక ధృవ రాజకీయ ప్రపంచంలో ఉన్న మనం ఇప్పుడు పార్టీ నడపడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. అలాంటి ఆశ ఉన్నవాళ్లే మావోయిస్టుల వైపు చూస్తున్నారని విజ్ఞుల ప్రగాఢ అభిప్రాయం. రాజకీయ పార్టీ నడపడం వేరు, మావోయిస్టుగా పని చేయడం వేరు.
మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో పరస్పర విరుద్ధమైన భావాలు, సిద్ధాంతాలను పక్కనపెట్టి పార్టీలు కలిసి అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేశాయి. అది మావోయిస్టులు ఆచరించగలుగుతారా లేదా అన్నది డాలర్ల ప్రశ్న. లేదా శేష జీవితాన్ని రాజకీయ తాత్వికత ప్రబోధనకు మాత్రమే పరిమితం చేస్తారా అన్నది చూడాలి. రాజకీయ దృష్టి ఒక ఖండూతి. అది మనుషుల్ని ఊరికే ఉండనివ్వదు. చూడాలి.. ఏం జరుగుతుందో.
డా. పి. భాస్కర యోగి, సోషల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
