- ఆ రాడార్ పరిధి 5 వేల కి.మి.
- బాలిస్టిక్ మిసైళ్లను ముందుగానే గుర్తించే సామర్థ్యం రాడార్ సొంతం
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధంలో భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రజల ప్రాణాలే కాదు, మూడు దేశాలకు చెందిన అత్యాధునిక, వందల కోట్ల విలువైన మిలిటరీ ఆయుధాలు కూడా నాశనమయ్యాయి. తాజాగా తాము జరిపిన ప్రతిదాడుల్లో గల్ఫ్ లో ఏర్పాటు చేసిన అమెరికాకు చెందిన అతిపెద్ద ఏఎన్ఎఫ్పీఎస్ 132 రాడార్ నాశనమైందని ఇరాన్ తెలిపింది. ప్రెసిషన్ మిసైల్ స్ట్రయిక్‌తో ఆ రాడార్‌ను నాశనం చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) పేర్కొంది.
ఆ రాడార్ రేంజ్ పరిధి 5 వేల కిలోమీటర్లు అని ఐఆర్ జీసీ పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. కాగా.. ఏఎన్ఎఫ్పీఎస్ వంటి రాడార్లు ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలకు అత్యంత కీలకం. శత్రు దేశ క్షిపణులను ముందుగానే గుర్తించి, ట్రాక్ చేసి, అడ్డుకునే సామర్థ్యం వీటి సొంతం.
ఈ రాడార్ ను ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ వద్ద ఏర్పాటు చేశారని డిఫెన్స్ సెక్యూరిటీ ఏషియా పేర్కొంది. ప్రధానంగా బాలిస్టిక్ మిసైల్స్ ను ముందుగానే గుర్తించేందుకు అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ఈ రాడార్‌ను అభివృద్ధి చేశారు. దీనిని అమెరికా 2013లో సుమారు 1.1 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఏర్పాటు చేసింది.
అమెరికా రక్షణ కార్యకలాపాలకు ఎదురుదెబ్బ
రాడార్ ధ్వంసమైన విషయాన్ని ఖతార్ అధికారులు కూడా ధ్రువీకరించారు. రాడార్ ధ్వంసం కావడంతో గల్ఫ్ దేశాల్లో అమెరికా పర్యవేక్షణ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చని, అంతేకాకుండా గల్ఫ్ దేశాల ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ రక్షణ కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని వారు పేర్కొన్నారు. ఇరాన్ మిసైల్ కార్యకలాపాలను మానిటర్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రాడార్ వ్యవస్థకు ‘ఎపిక్ ఫ్యూరీ’గా అమెరికా పేరుపెట్టింది.
అత్యాధునిక ఆయుధాలు, బీ2 బాంబర్లతో పాటు స్టెల్త్ బాంబర్లు కూడా ఇందులో ఉన్నాయి. కాగా.. షాహెద్ 136 డ్రోన్లతో ఇరాన్ ఆ దాడి జరిపి ఉండవచ్చని భావిస్తున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా కూడా అలాంటి డ్రోన్లనే ఉపయోగించింది. మరోవైపు ఇరాన్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను అమెరికా యాక్టివేట్ చేసింది. దానితోపాటు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లనూ రంగంలోకి దించింది.
