నిషేధిత జాబితాలో  39,468 ఇండ్లు.. యాదాద్రి జిల్లాలో సెక్షన్ -22ఏ ప్రకారం ఓనర్లు, ఇంటి నెంబర్లు సహా రిపోర్ట్

 నిషేధిత జాబితాలో  39,468 ఇండ్లు.. యాదాద్రి జిల్లాలో సెక్షన్ -22ఏ ప్రకారం ఓనర్లు, ఇంటి నెంబర్లు సహా రిపోర్ట్

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ఇచ్చిన భూములతో పాటు ఇండ్లను కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్​1908లోని సెక్షన్​ 22ఏలో చేర్చింది. ప్రభుత్వం ఇచ్చిన భూములు, ఇంటి స్థలాలు మున్ముందు చేతులు మారకుండా తీసుకునే చర్యల్లో  భాగంగానే ఈ సెక్షన్​లో చేర్చారు. కాగా, యాదాద్రి జిల్లాలో ఈ తరహాలో ప్రభుత్వ పరిధిలో 28,549 ఎకరాల భూమి, నిషేధిత జాబితాలో 39,468 ఇండ్లు ఉన్నట్లు 
తేలింది. 

రిజిస్ట్రేషన్​ యాక్ట్ 1908..

ఉమ్మడి రాష్ట్రంలో 2006కు ముందు ప్రభుత్వ భూములు పీవోబీలో లేకపోవడంతో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ పరిణామంతో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుర్తించి 22ఏ కింద చేర్చింది. ఆ తర్వాత 2012, 2013లో భూముల వివరాలు పరిశీలన చేసినట్లుగా ఆఫీసర్లు చెబుతున్నారు. 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత 2021లోనూ భూముల వివరాలను పరిశీలించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలోని భూముల పరిరక్షణ కోసం వాటిని 22ఏలో చేర్చాలని నిర్ణయించారు.

ప్రభుత్వ పరిధిలో 28,549 ఎకరాలు..

ఏడాదిగా పాత రికార్డులను పరిశీలించిన ఆఫీసర్లు భూముల లెక్కలు తేల్చారు. యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 319 రెవెన్యూగ్రామాల్లోని భూముల లెక్కలు నమోదు చేశారు. మొత్తంగా 2,450 సర్వే నెంబర్లలో 28,549 ఎకరాల భూమి ప్రభుత్వ పరిధిలో ఉందని గుర్తించారు. ఈ భూముల్లో సాగు జరగడం లేదని పేర్కొనడంతో పాటు గుట్టలు ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఎక్కువగా రాళ్లతో కూడిన భూమి ఉందని రిపోర్ట్​లో నమోదు చేశారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్న భూముల లెక్కలు వేరేగా ఉన్నాయి. 

నిషేధిత జాబితాలో 39,468 ఇండ్లు..

యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 319 రెవెన్యూ గ్రామాల్లో గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూముల్లో నిర్మించిన ఇండ్ల లెక్కను తేల్చారు. మొత్తంగా 427 పంచాయతీల్లో 39,468 ఇండ్ల ఓనర్ల పేర్లతో పాటు ఇంటి నెంబర్లను కూడా సేకరించి 22ఏలో చేర్చారు. ఇందులో చేర్చిన ఇండ్ల క్రయ విక్రయాలు జరిగినా రిజిస్ట్రేషన్​ చేయడం సాధ్యపడదు. భువనగిరి మండలంలో అత్యధికంగా 5 వేల ఇండ్లను చేర్చగా, ఆ తర్వాతి స్థానంలో తుర్కపల్లి మండలంలో 4,803 ఇండ్లను చేర్చారు. తక్కువగా అడ్డగూడూరు మండలంలో 1,041 ఇండ్లను చేర్చారు. అత్యధికంగా చౌటుప్పల్​లోని 77 వెంచర్లను చేర్చారు. 

చేర్చిన భూములు ఇవే..

పాత పహాణీలను పరిశీలించడం ద్వారా ఈ భూముల లెక్కలు తీశారు.  ఈ ప్రకారం భూములను పరిశీలించిన ఆఫీసర్లు అసైన్డ్, సీలింగ్, భూదాన్​, ఎవాక్యూ ప్రాపర్టీస్​ (1948లో దేశ విభజన తర్వాత పాకిస్తాన్​కు వెళ్లిన వారి భూములు)ను రిజిస్ట్రేషన్​ యాక్ట్​ 1908 సెక్షన్​ 22ఏ (1), (బీ) కింద  సర్వే నెంబర్ల వారీగా చేర్చారు. దేవాదాయ, వక్ఫ్​ భూములను 22ఏ (1), (సీ) కింద వేర్వేరుగా చేర్చారు. సిట్, ఏసీబీ, ఎన్​ఫోర్ట్​మెంట్, ఆర్ఆర్​ యాక్ట్​ ప్రయోగించిన వివాదస్పద భూములు, ఇతర ఆస్తులను 22ఏ (1), (ఇ) కింద చేర్చారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నిర్మించిన ఇండ్లను కూడా 22ఏ(1), (ఏ) కింద చేర్చారు. ఈ సెక్షన్​లో చేర్చిన భూములు, ఇండ్లు ఇక 
రిజిస్ట్రేషన్లు జరగవు.