మూసీలో పెద్ద బిల్డింగ్స్ కనిపించట్లేదా?..పేదల ఇండ్లను మాత్రమే కూల్చేస్తరా?: కవిత

మూసీలో పెద్ద బిల్డింగ్స్ కనిపించట్లేదా?..పేదల ఇండ్లను మాత్రమే కూల్చేస్తరా?: కవిత
  • నార్సింగిలో మూసీలో నిర్మాణాలపై స్థానికులతో కలిసి ఆందోళన

హైదరాబాద్, వెలుగు: మూసీ నదిలో బహుల అంతస్తుల భవనాలు కడుతున్నా హైడ్రాకు కనిపించడం లేదని, కానీ, కుత్బుల్లాపూర్​లో మాత్రం పేదల ఇండ్లను కూల్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఖమ్మంలోని వెలుగుమట్లతోపాటు మూసీలోని పేదల ఇండ్లను అక్రమంగా కూల్చేశారని మండిపడ్డారు.  మూసీలో కడుతున్న భారీ బిల్డింగ్ హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

మంగళవారం నార్సింగిలో మూసీని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్​ ఎస్టేట్​ వెంచర్​పై చర్యలు చేపట్టాలనే డిమాండ్​తో స్థానికులతో కలిసి కవిత ఆందోళన చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేదల ఇండ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని ఫైర్​ అయ్యారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్​ల నిర్మాణానికి పర్మిషన్​ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు ఈ నిర్మాణాలను ఆపినా ఆ తర్వాత కమీషన్లు తీసుకుని మళ్లీ పర్మిషన్​ ఇచ్చారని ఆరోపించారు. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ బుల్డోజర్లు తీసుకొచ్చేదాకా అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది పేదల ఇండ్లు కూల్చేశారని, త్వరలోనే అక్కడకు వెళ్తామన్నారు. గాంధీ సరోవర్ పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. 

పెద్దల బిల్డింగ్‌లు కనిపించట్లేదా?

మూసీ మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదల బిల్డింగులు కూలగొడుతున్నారని, దానిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని కవిత అన్నారు. నార్సింగిలో ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు కవిత సహా ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. “మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు.. అదే వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చేశారు.

హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేపు అయినా హైడ్రా బుల్‌డోజర్లు ఇక్కడికి వస్తేనే.. రంగనాథ్ స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని మేం భావిస్తాం. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్నా అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నది. అక్రమ నిర్మాణాలపై న్యాయపోరాటం చేస్తం” అని ఆమె పేర్కొన్నారు