భజన ఆపి.. బాధ్యతాయుత పాలన సాగించు!..సీఎం రేవంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ సూచన

భజన ఆపి.. బాధ్యతాయుత పాలన సాగించు!..సీఎం రేవంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ సూచన
  • రాహుల్ పీఎం కాలేడని రేవంత్​కూ తెలుసు 
  • పీఎం కుర్చీ కుటుంబ ఆస్తి కాదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని, అందుకే భజన ఆపి.. బాధ్యతాయుతంగా పాలన సాగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. ‘‘ప్రధాని కుర్చీ అనేది రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వడానికి.. చిరునవ్వు చిందించి తలాడించగానే దక్కడానికి అదేమీ నిజాం దర్బార్ కాదు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని పోస్టుకు ఖాళీ లేదని, 140 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే మోదీకి మూడుసార్లు జై కొట్టారని గుర్తుచేశారు.

సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ ను ప్రధానిని చేస్తానంటూ చేస్తున్న వ్యాఖ్యలపై మంగళవారం ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. రాహుల్ గాంధీ అనే గ్రహణం దేశాన్ని మూడుసార్లు చీకటి చేయాలని చూసిందని.. కానీ, మోదీ అనే అభివృద్ధి సూర్యుడి కిరణాల ముందు ఆ ఆటలు సాగలేదని ఎద్దేవా చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం. పీఎం కుర్చీ కుటుంబ ఆస్తి కాదు. హైదరాబాద్ లోని భజనపరుల నోట్ల కట్టలతో ప్రధానిని ఎన్నుకోరు.

పేద ప్రజల ఓట్లతో ఎన్నుకుంటారు’’ అని సంజయ్ పేర్కొన్నారు. దేశం ప్రగతి రంగుల్లో సంబరాలు చేసుకుంటుంటే, కాంగ్రెస్ మాత్రం అవినీతి మసిని పూసుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలను, యువరాజు ఆశలను బూడిద చేయడానికి దేశ ప్రజలు రాజకీయ హోలీకా దహనం కోసం సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఫెయిల్యూర్ లీడర్ మొహాన్ని ఎన్ని రంగులతో కవర్ చేసినా దాచలేరన్నారు. రాహుల్ గాంధీ మొఖంలో నవ్వు చూడాలని ఆరాటపడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి.. రాష్ట్ర ప్రజల కన్నీళ్లు మాత్రం కనిపించడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.