ChiruVenky: ఏంది వెంకీ సంగతి? అదిరిపోయిందిగా చిరు గారూ! సోషల్ మీడియాను ఊపేస్తున్న సెలబ్రేషన్స్ వీడియో.!

ChiruVenky: ఏంది వెంకీ సంగతి? అదిరిపోయిందిగా చిరు గారూ! సోషల్ మీడియాను ఊపేస్తున్న సెలబ్రేషన్స్ వీడియో.!

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం  ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.  థియేటర్లలో  ప్రేక్షకులను నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ భోగి సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 బాక్సాఫీస్ వద్ద విజృంభణ!

సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిరంజీవి మార్క్ గ్రేస్, వెంకటేశ్‌ టైమింగ్‌కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మెగాస్టార్ తన అసలు పేరుతోనే (శంకర వరప్రసాద్) టైటిల్ ఉండటం, అందులోనూ విక్టరీ వెంకటేశ్‌ ఒక కీలకమైన పాత్రలో మెరవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

సక్సెస్ వేడుకల్లో సందడి

సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో చిత్రబృందం ప్రత్యేకంగా సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంది.. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్‌లతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొని సందడి చేశారు. అందరూ కలిసి భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలో హైలైట్ ఏంటంటే.. సినిమాలో హిట్ అయిన ఒక పాటను గుర్తుచేస్తూ చిరంజీవి తనదైన శైలిలో “ఏంది వెంకీ సంగతి?” అని అడిగారు. 

అదిరిపోయిందిగా సంక్రాంతి!

దానికి వెంకీ తనదైన మ్యానరిజంతో “అదిరిపోయిందిగా సంక్రాంతి!” అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి అనిల్ రావిపూడి సినిమాల్లో ఫేమస్ డైలాగ్ “అంతేగా.. అంతేగా!” అంటూ చిందేయడం అక్కడి వారిని అలరించింది. రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరై, తన తండ్రి సినిమా విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి నాన్న స్క్రీన్ షేర్ చేసుకోవడం చూడ ముచ్చటగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎందుకు ఈ సినిమా స్పెషల్?

ఈ సినిమా కేవలం కామెడీ మాత్రమే కాకుండా, చిరంజీవి గారిలోని మాస్ యాంగిల్‌ను, వెంకటేశ్‌ గారిలోని ఎమోషనల్ యాంగిల్‌ను అనిల్ సరిగ్గా బ్యాలెన్స్ చేశారు అనిల్ రావిపూడి.  ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా చిరు-వెంకీల డ్యాన్స్ బిట్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. చిరంజీవి సరసన నయనతార తన నటనతో మెప్పించింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, సాహు గారపాటి , సుస్మిత కొణిదెల నిర్మాణ విలువలు సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.  మొత్తానికి 'మన శంకర వరప్రసాద్ గారు' ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ వీడియో చూస్తుంటే, మెగా , విక్టరీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.