టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని కోల్పోనున్నాడు. అదేంటో ఒక్క రోజులో నెంబర్ వన్ ర్యాంక్ పోవడం ఏంటి అనుకున్నా అదే నిజం. ఐసీసీ బుధవారం (జనవరి 14) ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ సహచరుడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అయితే రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కోహ్లీ కంటే కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే వెనకపడి ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ 785 రేటింగ్ పాయింట్స్ తో కోహ్లీ టాప్ లో ఉండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డేకు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించాడు. బుధవారం (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో కోహ్లీ విఫలం కాగా.. మరోవైపు మిచెల్ సెంచరీతో సత్తా చాటాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ స్టార్ మిచెల్ మాత్రం ఏకంగా 131 పరుగులతో చెలరేగాడు. ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే కోహ్లీ తన టాప్ ర్యాంక్ మిచెల్ కు కోల్పోయే ప్రమాదముంది. కోహ్లీ తన టాప్ ర్యాంక్ ను కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంది. న్యూజిలాండ్ జరగబోయే చివరి వన్డేలో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడితే అగ్రస్థానం పదిలంగా ఉంటుంది.
అదే సమయంలో మిచెల్ మూడో వన్డేలో విఫలం కావాలి. ప్రస్తుతానికైతే కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మిచెల్ రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. మరి చివరి వన్దేలో వీరిద్దరి మధ్య నెంబర్ వన్ పోరు ఎలా ఉంటుందో చూడాలి. ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో హిట్ మ్యాన్ కేవలం 26 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో నెంబర్ వన్ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ జద్రాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10వ స్థానంలో నిలిచాడు.
