న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన భారత తొలి వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. భారత దిగ్గజ క్రికెటర్ మహేంధ్ర సింగ్ ధోనికి కూడా సాధ్యం కానీ ఈ రేర్ ఫీట్‌ను రాహుల్ అందుకున్నాడు. అంతేకాకుండా రెండో వన్డే జరిగిన రాజ్ కోట్ స్టేడియంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గానూ రాహుల్ రికార్డ్ సృష్టించాడు.
కాగా, మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. జట్టు మొత్తం విఫలమైన వేళ ఒంటరి పోరాటం చేసి భారీ స్కోర్ అందించాడు. 92 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేఎల్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. రాహుల్ వన్డే కెరీర్లో ఇది 8వ సెంచరీ. మిడిల్ ఆర్డర్లో ఆడుతూ కేవలం 93 మ్యాచ్‌ల్లోనే 8 సెంచరీలు పూర్తి చేయడం విశేషం.
రాహుల్ సెంచరీతో ఇండియా భారీ స్కోర్:
బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు డీసెంట్ టోటల్ అందించాడు. రాహుల్ తో పాటు గిల్ (56) హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. రాహుల్ 112 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, జకారీ ఫౌల్క్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీనుకున్నారు.
