సంక్రాంతి పండుగ పూట.. భోగి రోజైన ఇవాళ (జనవరి 14) హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు గజగజా వణికించిన చలి.. దాదాపు తగ్గినట్లే కనిపించింది.ఉదయం, సాయంత్రం ఎక్కడా మంచు కురుస్తున్నట్లు కనిపించకపోగా.. రాత్రి అక్కడక్కడా చిరుజల్లులు కురవటం మరోరకమైన అనుభూతినిచ్చింది.
బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షపు చినుకులు పలకరించాయి. చందానగర్, మియాపూర్ లో వర్షం కురిసింది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో కూడా జల్లులు కురిశాయి. అదే విధంగా మెహిదీపట్నం, సోమాజిగూడ ప్రాంతాలలో కూడా జల్లులు కురిశాయి. మరో గంట రెండు గంటల్లో వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. అదే క్రమంలో ఒక్కసారిగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అదే విధంగా సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
