షాపింగ్ మాల్స్ కూడా ఇవ్వని ఆఫర్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (BMC) ఎన్నికల్లో పార్టీలు ఇస్తున్నాయి. ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు షాపింగ్ మాల్స్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. ఓటర్లకు చీరలు, వెండి పాత్రలు, డబ్బులు పంచడంలో పోటీ పడుతున్నాయి. గురువారం (జనవరి 15) ప్రారంభమైన BMC ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు భారీ ఎత్తున కానుకలు ఇవ్వడం కొన్ని ప్రాంతాల్లో వివాదాలకు దారితీసింది.
బుధవారం పార్టీలు భారీ ఎత్తున పంపకాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కానుకల తో పాటు ఓటర్లను డైవర్ట్ చేసేందుకు లంచం కూడా ఇస్తున్నట్లు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంతో పాటు నవీ ముంబై ఖందేశ్వర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.
చీరల నుంచి వెండి పాత్రల వరకు.. ఓటర్లకు భారీ ఎత్తున పంచుతున్నట్లు స్థానికులు తెలిపారు. అధికార పార్టీ ఎన్వలోప్స్ లో డబ్బులు ఇస్తూ ఓటుకు నోటు స్కామ్ కు పాల్పడుతున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో కార్యకర్తలు గొడవలకు దిగుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ధారావి, కలీన,సియోన్,చెంబూర్, బోరివి, నవీ ముంబై, థానే, వసై-విరార్, కళ్యాణ్-దొంబివిలీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఈస్ట్ నలసపారా లో టూ వీలర్ డ్రైవర్ నుంచి రూ.10 లక్షలు సీజ్ చేయడం కూడా సంచలనంగా మారింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు : శివసేన
శివసేన (యుబిటి) సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, పాలక పార్టీ ఓట్లు పొందడానికి డబ్బు, చీరలు పంపిణీ చేస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రచారం ముగిసింది, కానీ పాలక పార్టీ వేరే పని చేస్తోంది... చీరలు పంపిణీ చేస్తున్నారు, డబ్బు పంపిణీ చేస్తున్నారు... నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు పంపిణీ చేస్తున్నారు.. అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ సభ్యుడు సచిన్ సావంత్ మాట్లాడుతూ,నేడు అవినీతిపరులను ఆపకపోతే, ప్రజాస్వామ్యం నాశనం అవుతూనే ఉంటుంది. ముంబైలోని శాంత్ నగర్ జాన్ కళ్యాణ్‌లో బిజెపికి చెందిన వ్యక్తులు మిక్సర్లు పంపిణీ చేస్తున్నారు.. మరాఠీ ప్రజలు దీనిని గుర్తించాలని పిలుపునిచ్చారు.
చర్యలు తీసుకుంటాం: ఎన్నికల కమిషనర్
విపక్షాలు లేవనెత్తిన సమస్యలలో ఒకటి డబ్బు పంపిణీ. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, నిఘా బృందాలతో తనిఖీ చేస్తున్నాం. అలాంటి సంఘటన ఏదైనా జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాగ్మారే హామీ ఇచ్చారు.
ముంబై BMC ఎన్నికలు 2026:
దేశ ఆర్థిక రాజధానిలో జరిగే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను అధికార కూటమితో పాటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 227 వార్డులలో ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 1,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.1.03 కోట్లకు పైగా అర్హత కలిగిన ఓటర్లు నగర పౌర భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. ముంబై అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. 25 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.
