హైదరాబాద్: ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ల అరెస్టులపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ అంటూ వస్తోన్న వార్తలపైన క్లారిటీ ఇచ్చారు. సిట్ విచారణకు పిలిచినప్పుడు రావాలి కదా.. తప్పు చేయనప్పుడు భయం ఎందుకని ప్రశ్నించారు.
విచారణకు వస్తానని చెప్పి.. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటే అరెస్ట్ చేయరా అని అన్నారు. రిపోర్టర్లు రాత్రికి రాత్రే బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారని.. విచారణకు సహకరించకుండా ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. ఎంక్వైరీకి రాకుండా రాత్రికే రాత్రి ఎందుకు వెళ్తున్నారన్నారు. మేం అరెస్ట్ చేస్తాం.. న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
సదరు రిపోర్టుర్లు ఏ ఆధారం ఉందని మహిళా ఐఏఎస్‌లను కించపర్చారని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం సిట్‌కు లేదని తెలిపారు. ఈ కేసులో ఎవరున్నా విచారణ చేస్తామన్నారు. చట్ట ప్రకారమే రిపోర్టర్లపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. రిపోర్టర్ల ఇంటి డోర్లు పగలకొట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఛానల్ సీఈవో విచారణకు రావాలని.. లేకపోతే అదుపులోకి తీసుకుంటామన్నారు.
చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు క్రూరత్వమని అన్నారు. మహిళలపై విమర్శల వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడతాయన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని.. ఈ సమయంలో ఇలాంటి అంశాలపై మాట్లాడాల్సి రావడం బాధాకరమని అన్నారు. సృష్టికి మూలం అమ్మ అని.. స్త్రీని విమర్శించడం అంటే సృష్టిని విమర్శించినట్లేనన్నారు.
