అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి 75 దేశాలకు వీసా జారీ నిలిపివేయాలని డిసైడయ్యింది. అమెరికాలోకి అక్రమ వలసలను నివారించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే ప్రకటించిన క్రమంలో.. బుధవారం (జనవరి 14) తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
జనవరి 21 నుంచి వీసా ప్రాసెసింగ్ ను సస్పెండ్ చేయనుంది. వీసా ప్రాసెస్ లో భాగంగా ఇకనుంచి ఇనిషియల్ స్క్రీనింగ్, వెట్టింగ్ (అంటే లోతైన విచారణ) విధానాలను అనుసరించనుంది.
వైట్ హౌస్ అధికారి సమాచారం ప్రకారం.. కన్సూలేట్ అధికారులు ప్రస్తుత చట్టాల ప్రకారం వీసాలను రిజెక్ట్ చేయాలని.. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసేందుకు ఈ విధానాలను అనుసరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో ఇరాన్, రష్యా, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, ఇరాక్, ఈజిప్ట్, నైజీరియా, థాయిలాండ్, యెమెన్ తదితర దేశాలకు వీసా నిలిపివేయనున్నారు. ఇప్పటికే ఈ దేశాల నుంచి అప్లై చేసుకున్నవారు వీసా పొందటం చాలా కష్టం. ప్రస్తుత నిర్ణయంతో ఆ దేశాల పౌరులకు వీసా రావడం మరింత క్లిష్టమైనట్లే. అయితే ఈ లిస్టులో బ్రెజిల్ ను కూడా చేర్చడం చర్చనీయాంశంగా మారింది.
అమెరికా విదేశాంగ శాఖ తిరిగి వీసా ప్రాసెసింగ్ విధానాన్ని పున:సమీక్షించే వరకు వీసా జారీ నిలిపివేత కొనసాగుతుంది. మిన్నెసోటాలో చేపట్టిన విచారణ కారణంగా.. సోమాలియా తీవ్రంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశానికి వీసాలను జారీ చేయడాన్ని ఆపేశారు.
వీసా అప్లికేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేయాలని వివిధ దేశాలలో ఉన్న అమెరికా దౌత్య అధికారులకు 2025 నవంబర్ లోనే అమెరికా ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ బెనిఫిట్స్ పైన వస్తున్న వారికి సైతం వీసాను తిరస్కరించాలని సూచించింది.
