Under 19 World Cup 2026: 5 వికెట్లతో విజృంభించిన హెనిల్ పటేల్.. టీమిండియా ధాటికి 107 పరుగులకే USA ఆలౌట్

Under 19 World Cup 2026: 5 వికెట్లతో విజృంభించిన హెనిల్ పటేల్.. టీమిండియా ధాటికి 107 పరుగులకే USA ఆలౌట్

అండర్ -19 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం చేయడం ఖాయంగా మారింది. అండర్-19 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా గురువారం (జనవరి 15) తొలి మ్యాచ్ ఆడుతోంది. బులవాయో వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మన బౌలర్లు చెలరేగారు. పసికూనపై ప్రతాపం చూపిస్తూ మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏను కేవలం 107 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇండియా 108 పరుగుల లక్ష్యంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. స్వల్ప లక్ష్యం కావడంతో ఈ మ్యాచ్ లో ఇండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. 

మొదట బ్యాటింగ్ కు దిగిన యూఎస్ఏకు మంచి ఆరంభం లభించలేదు. అమరీందర్ గిల్ ను హెనిల్ పటేల్ కేవలం ఒక పరుగు వద్ద ఔట్ చేశాడు. ఈ దశలో సాహిల్ గార్గ్ (16), అర్జున్ మహేష్ (16) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పరుగుల వేగం బాగా మందగించింది. రెండో వికెట్ కు 28 పరుగులు జోడించిన తరువాత ఈ జోడీని దీపేష్ దేవేంద్రన్ విడగొట్టాడు. దీంతో 29 పరుగుల వద్ద  యూఎస్ఏ తమ రెండో వికెట్ కోల్పోయింది. ఇక్కడ నుంచి యూఎస్ఏ వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకుంది. ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), అర్జున్ మహేష్ (16), అమోఘ్ అరేపల్లి (3) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. 

ఒక దశలో వికెట్ నష్టానికి 29 పరుగులతో పర్వాలేదనిపించిన యూఎస్ఏ కాసేపటికే 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అద్నిత్ జాంబ్, నితీష్ సుడిని కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. ఆరో వికెట్ కు 30 పరుగులు జోడించి జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీ బ్రేక్ కావడంతో యూఎస్ఏ ఇన్నింగ్స్ త్వరగానే ముగింది. మిడిల్ ఓవర్స్ లో హెనిల్ పటేల్ విజృంభించడంతో ప్రత్యర్థి జట్టు కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లు పడగొట్టాడు. దీపేష్ దేవేంద్రన్, ఆర్.ఎస్. అంబ్రిష్, ఖిలాన్ పటేల్,వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ పడగొట్టారు.