- 'ఎడిట్' ఆప్షన్‌తో భూభారతిలో తక్కువ చలాన్ చెల్లింపు
- రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 47 ఏ ప్రకారం పట్టాదారులకు ఆర్ఆర్ యాక్ట్ కింద తప్పనిసరి నోటీసులు జారీ
- పేమెంట్చెల్లించని డాక్యూమెంట్ల ల్యాండ్ బ్లాక్ చేసే అవకాశం
యాదాద్రి, వెలుగు: భూముల రిజిస్ట్రేషన్ల చలాన్ చెల్లింపులో జరిగిన అక్రమాలు మరింత గందరగోళానికి దారి తీస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న యజమాని చలాన్ కోసం నిర్వాహకులకు పేమెంట్ మొత్తం చేసినా.. చెల్లింపులు మాత్రం తక్కువగా జరిగాయి.
అయితే చలాన్ తక్కువగా చెల్లింపు జరిగిన డాక్యుమెంట్ల పట్టాదారులకు మిగిలిన పేమెంట్మొత్తం చెల్లించాలని జనగామలో నోటీసులు జారీ చేశారు. యాదాద్రి జిల్లాలో నోటీసులు జారీ చేసే విషయంలో రెవెన్యూఆఫీసర్లు హయ్యర్ఆఫీసర్ల ఆదేశాల కోసం చూస్తున్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా బకాయిపడిన మొత్తం చెల్లించని పక్షంలో డాక్యుమెంట్లను బ్లాక్ చేసే అవకాశం ఉంది.
సెక్షన్47ఏ ప్రకారం చలాన్
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం చలాన్చెల్లించాల్సి ఉంటుంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్యాక్ట్47ఏ ప్రకారం నిర్ణయించిన భూమి విలువకు అనుగుణంగా చలాన్ పేమేంట్చేయాల్సి ఉంటుంది. కుమారుడికి భూమిని గిప్ట్ డీడ్ చేస్తే విలువలో 3 శాతం, కుమార్తెకు 6.5 శాతం, ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తే 7 శాతం ఫీజును చలాన్ రూపంలో పేమెంట్చేయాల్సి ఉంటుంది.
చలాన్ చెల్లింపులో చేతి వాటం
ధరణి, భూ భారతి పోర్టల్స్అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత తహసీల్దార్లు నిర్వహిస్తున్నారు. భూ భారతి పోర్టల్‌లోని ‘సిటిజన్’లోని ఎడిట్ఆప్షన్ద్వారా ఇంటర్నెట్ మీ సేవ సెంటర్ల నిర్వాహకులు, డాక్యూమెంట్ఆపరేటర్లు కొందరు చలాన్ చెల్లింపులో చేతివాటం ప్రదర్శించి పేమెంట్ తక్కువ చేస్తూ, మిగిలిన మొత్తాన్ని రూ. కోట్లలో తమ సొంత అకౌంట్లకు మళ్లించుకున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం జనగామ జిల్లాలో వెలుగు చూడడంతో చర్యలకు దిగిన ప్రభుత్వం యాదాద్రి జిల్లాలో 1367, జనగామ జిల్లాలో 122 డాక్యూమెంట్లలో చేతివాటం ప్రదర్శించినట్టు గుర్తించింది. చేతివాటం ప్రదర్శించిన నిర్వాహకులను ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తించి, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయడం జరిగిపోయింది. వారిలో కొందరు పోలీసుల అదుపులో ఉండడం, మరికొందరిని అదుపులోకి తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించింది.
డాక్యుమెంట్లు బ్లాక్ చేసే అవకాశం...?
ఇండియన్స్టాంప్అండ్రిజిస్ట్రేషన్యాక్ట్1899 సెక్షన్ 47 ఏ ప్రకారం మార్కెట్ విలువలో నిర్ణయించిన ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం నిర్వాహకులకు పూర్తి స్థాయిలో ఫీజు చెల్లింపులు జరిపినా, ప్రభుత్వ ఖజానాకు తక్కువ చేరడంతో పట్టాదారులు డిఫాలర్లుగా తేలారు. తక్కువ చెల్లించిన చాలన్ను రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా పట్టాదారులకు నోటీసులు జారీ చేస్తారు.
సదరు పట్టాదారుడు బకాయిగా ఉన్న అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. నోటీసులు జారీచేసినా పేమెంట్ చేయని పక్షంలో ఆయా డాక్యుమెంట్లలోని సర్వే నెంబర్ల భూమిని బ్లాక్ చేస్తారు. దీంతో ఆ సర్వే నెంబర్ల భూమి క్రయ విక్రయాలు జరగే అవకాశం ఉండదు. ఆలస్యమైన బకాయిలకు 18 శాతం వడ్డీతో కలిపి వసూలు చేయవలసి ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు.
యాదాద్రిలో పట్టాదారులకు నోటీసులు..!
జనగామ జిల్లాలో తక్కువగా పేమెంట్ చేసిన 80 డాక్యూమెంట్లకు సంబంధించిన పట్టాదారులకు అక్కడి తహసీల్దార్లు నోటీసులు జారీ చేశారు. స్టాంప్అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్47ఏ ప్రకారం చలాన్ చెల్లించనందున మిగిలిన మొత్తం చెల్లించి, డాక్యుమెంట్లను రెగ్యులర్చేయించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
జనగామలో నోటీసులు జారీ చేయడంతో యాదాద్రిలోనూ 1017 డాక్యుమెంట్లకు చెందిన పట్టాదారులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్లు చెబుతున్నారు. హయ్యర్ ఆఫీసర్ల నుంచి వచ్చిన ఆదేశాల రాగానే నోటీసులు జారీ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని, సంక్రాంతి సెలవుల తర్వాత జారీ చేసే అవకాశం ఉందని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు.
