న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇండియాకు ఓటమి తప్పలేదు. బుధవారం (జనవరి 14) జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా ఉంది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా విఫలం కావడంతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. డారిల్ మిచెల్ (131*) సెంచరీతో కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. విల్ యంగ్ 87 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఓటమిపై టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ మాట్లాడాడు. మిడిల్ ఓవర్లలో ఇండియా వికెట్లు తీయలేకపోవడం వల్ల న్యూజిలాండ్ ఛేజింగ్‌పై పట్టు సాధించిందని శుభ్‌మాన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
"మిడిల్ ఓవర్లలో మేము ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాము. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోతే మరో 15-20 పరుగులు జోడించినా విజయం చాలా కష్టమవుతుంది. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లపై ఒత్తిడి పెంచలేకపోతే లక్ష్యాన్ని ఆపడం చాలా కష్టం. ఇలాంటి వికెట్లపై భాగస్వామ్యం ఏర్పడిన వెంటనే సెట్ బ్యాట్స్‌మన్ దానిని పెద్దదిగా చేయాలి. ఎందుకంటే బ్యాట్స్‌మన్ స్వేచ్ఛగా పరుగులు చేయడం అంత సులభం కాదు. మేము ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాము. మొదటి 10 ఓవర్లలో అసాధారణంగా బౌలింగ్ చేశాము. న్యూజి లాండ్ మిడిల్ ఓవర్స్ లో చాలా బాగా బ్యాటింగ్ చేసింది. మేము వారిపై ఒత్తిడిని కొనసాగించలేకపోయాము". అని గిల్ మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్‌లో అన్నారు.
టీమిండియాను ఓడించిన మిచెల్, యంగ్ భాగస్వామ్యం:
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 284/7 స్కోరు చేసింది. తర్వాత న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 286/3 స్కోరు చేసి గెలిచింది. ఛేదనలో కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆరో ఓవర్‌లో డేవన్ కాన్వే (16)ను ఔట్ చేసి హర్షిత్ రాణా (1/52) శుభారంభం ఇచ్చాడు. దానికి కొనసాగింపుగా ప్రసిధ్ కృష్ణ (1/49) 13 ఓవర్‌లో హెన్రీ నికోల్స్ (10)ను పెవిలియన్‌కు పంపాడు. 46/2తో కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను యంగ్, మిచెల్ ఆదుకున్నారు. ఇండియా బౌలర్లందర్నీ దీటుగా ఎదుర్కొని పరుగులు సాధించారు.
ఈ క్రమంలో మిచెల్ 52, యంగ్ 68 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశారు. మూడో వికెట్‌కు 162 రన్స్ జోడించి యంగ్ ఔటైనా.. గ్లెన్ ఫిలిప్స్ (32 నాటౌట్) నిలకడగా ఆడాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మిచెల్ 96 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఫిలిప్స్‌తో నాలుగో వికెట్‌కు 78 రన్స్ జత చేసి గెలిపించాడు. మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది.
రాహుల్ సెంచరీ వృధా:
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ ఫెయిలైంది. ఓపెనర్లలో గిల్ మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో రోహిత్ శర్మ (24) విఫలమయ్యాడు. కివీస్ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ (3/56) టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. సింగిల్ తీయడానికి 11 బాల్స్ ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ తర్వాత లాఫ్టెడ్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టి కుదురుకున్నట్లు కనిపించాడు. కానీ 13వ ఓవర్‌లో క్లార్క్ వేసిన సీమ్ బాల్‌ను కవర్స్ భారీ షాట్ కొట్టబోయి యంగ్‌కు చిక్కాడు.
తొలి వికెట్‌కు 70 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ (23) అలవోకగా షాట్లు ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 47 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన గిల్‌ను 17వ ఓవర్‌లో జెమీసన్ (1/70) వెనక్కి పంపాడు. ఆ వెంటనే ఫుల్ లెంగ్త్ బాల్‌తో కోహ్లీని, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌తో శ్రేయస్ అయ్యర్ (8)ను క్లార్క్ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో 99/1తో ఉన్న ఇండియా స్కోరు 118/4గా మారింది.
ఈ దశలో రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అవతలి వైపు జడేజా (27) కూడా మంచి సహకారం అందించాడు. ట్రాక్‌లో బౌన్స్ తగ్గడంతో ఈ ఇద్దరు కివీస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. దాదాపు 15 ఓవర్ల పాటు వికెట్‌ను కాపాడుకుంటూ క్రమంగా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 52 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ తర్వాత స్పిన్నర్లపై బ్యాట్ ఝుళిపించాడు.
అయితే 39వ ఓవర్‌లో బ్రేస్‌వెల్ (1/34) లో లెంగ్త్ బాల్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి జడ్డూ ఔటయ్యాడు. ఐదో వికెట్‌కు 73 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 191/5 వద్ద వచ్చిన నితీశ్ కుమార్ (20) ఉన్నంతసేపు మెరుగ్గా ఆడాడు. ఆరో వికెట్‌కు 57 రన్స్ జోడించి వెనుదిరిగాడు. ఆరు బాల్స్ తేడాలో నితీశ్‌తో పాటు హర్షిత్ రాణా (2) ఔటయ్యాడు. చివర్లో సిరాజ్ (2 నాటౌట్)కు ఎక్కువగా స్ట్రయిక్ ఇవ్వకుండా వేగంగా ఆడిన రాహుల్ 87 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసి ఇండియాకు మంచి స్కోరు అందించాడు.
