ఉద్యోగులకు EPFO బొనాంజా.. దీపావళికి ముందే ATM, UPI ద్వారా పీఎఫ్‌‌‌‌ తీసుకునేందుకు వీలు

ఉద్యోగులకు EPFO బొనాంజా.. దీపావళికి ముందే ATM, UPI ద్వారా పీఎఫ్‌‌‌‌ తీసుకునేందుకు వీలు

న్యూఢిల్లీ: ఈ దీపావళికి కోట్లాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌‌‌‌ఓ)  నుంచి పెద్ద గిఫ్ట్ అందనుంది. ఈపీఎఫ్‌‌‌‌ఓ 3.0 అనే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఈ సంస్థ చూస్తోంది. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను బ్యాంక్ ఖాతాల్లా పనిచేసేలా మార్చనుంది.

ఈపీఎఫ్‌‌‌‌ఓ 3.0 అమలైతే  ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్‌‌‌‌ డబ్బును వెంటనే విత్‌‌‌‌డ్రా చేసుకోవచ్చు.  మెంబర్లు ఇకపై పీఎఫ్‌‌‌‌ డబ్బు కోసం రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. యూపీఐ యాప్‌‌‌‌లు లేదా ఏటీఎంల ద్వారా రూ. లక్ష వరకు అత్యవసర విత్‌‌‌‌డ్రాలను వెంటనే చేసుకోవచ్చు. 8 కోట్ల మందికి పైగా సభ్యులకు ఇది సాయపడుతుంది. 

ప్రస్తుతం పీఎఫ్‌‌‌‌ ఉపసంహరణ కోసం ఆన్‌‌‌‌లైన్ క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. ఈ విధానంలో డబ్బులు విత్‌‌‌‌డ్రా చేసుకోవడానికి టైమ్ పడుతోంది.  కొత్త వ్యవస్థలో యూఏఎన్‌‌‌‌, ఆధార్–-బ్యాంక్ లింక్ ఉంటే చాలు. వైద్య ఖర్చులు, విద్య, ఇల్లు, వివాహ అవసరాలకు డబ్బు వెంటనే విత్‌‌‌‌డ్రా చేసుకోవచ్చు. 

ప్రస్తుతం నెలకు రూ.వెయ్యిగా ఉన్న కనీస పింఛన్‌‌‌‌ను రూ.1,500–రూ.2,500కి పెంచే ప్రతిపాదనపై ఈపీఎఫ్‌‌‌‌ఓ బోర్డు చర్చిస్తోంది.  ట్రేడ్ యూనియన్లు కోరుతున్న పాత డిమాండ్ ఇది.

ఈపీఎఫ్‌‌‌‌ఓ 3.0 అమలైతే,  భారత పీఎఫ్‌‌‌‌ వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణలలో ఒకటిగా నిలుస్తుంది. ఉద్యోగులకు ఇది ఆర్థిక స్వేచ్ఛ, రిటైర్మెంట్ భద్రతను ఇస్తుంది.