
ఆమెది ఒక అందమైన కుటుంబం. కూతురు, భర్తే ఆమె లోకం. హాయిగా సాగుతున్న ఆమె జీవితాన్ని అంధకారం అలుముకుంది. ఒక అరుదైన వ్యాధి వల్ల భూమిక చూపు కోల్పోయింది. కానీ.. అంతటితో తన జీవితం ముగిసిపోయిందని బాధపడలేదు. తనను ఓడించడానికి ప్రయత్నించిన అంధత్వంతో పోరాడి గెలిచింది. కళ్లు లేకున్నా తన పనులు తాను చేసుకోగలిగేలా ట్రైనింగ్ తీసుకుంది. అంతేకాదు.. ఏదైనా సాధించాలనే సంకల్పంతో యూట్యూబ్ చానెల్ పెట్టి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
భూమిక సుదర్శన్‌ది కర్నాటకలోని బెంగళూరుకు దగ్గర్లోని దొడ్డబళ్లాపూర్‌లోని సోమేశ్వర లేఅవుట్. ఆమెకు 2010లో తలనొప్పి వచ్చింది. అది మామూలు సమస్యే కదా అనుకుంది. హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్ అన్ని టెస్ట్‌లు చేసి, ఆమెకు కంటి సమస్య ఉందని తేల్చి చెప్పాడు. అది ఆప్టిక్ న్యూరిటిస్ అనే ఒక అరుదైన కంటివ్యాధి. ఐదు లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. ముందుగా కళ్లలో మంటలు వస్తాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు క్రమంగా చూపుని కోల్పోతారు. ఈ విషయం తెలియగానే భూమికతోపాటు ఆమె కుటుంబం కూడా చాలా బాధపడింది. ఆమెని ఎన్నో హాస్పిటల్స్‌కి తీసుకెళ్లారు.
కానీ.. లాభం లేకుండా పోయింది. క్రమంగా చూపు మందగించింది. దాంతోపాటు ఆమె ఆత్మస్థైర్యం కోల్పోతూ వచ్చింది. చివరికి 2018లో తన 35 సంవత్సరాల వయసులో చూపు పూర్తిగా కోల్పోయింది. కొన్నాళ్లకు ఆ బాధ నుంచి బయటపడి, చూపులేకున్నా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఆమెకు ఫ్యామిలీ కూడా సపోర్ట్‌గా నిలిచింది. భర్త సుదర్శన్ పనుల్లో సాయం చేసేవాడు. ఆ తర్వాత ఇలాంటి దృష్టి లోపం ఉండి సవాళ్లను విజయవంతంగా అధిగమించిన కొంతమందిని కలిసింది. వాళ్ల దగ్గర భూమిక చాలా విషయాలు నేర్చుకుంది. విశ్వాసం, బలమైన సంకల్పం, కృషి వల్ల మళ్లీ తన పనులన్నీ తానే చేయడం అలవాటు చేసుకుంది.
బంధువు సాయంతో..
భూమికకు చూపు లేదు కాబట్టి, బయటికి వెళ్లలేదు. అందుకే ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేయాలి అనుకుంది. అయితే.. వాళ్ల బంధువుల్లో ఒకతను అప్పటికే యూట్యూబ్ చానెల్ నడుపుతున్నాడు. ఆ విషయం తెలిసి ‘నేను కూడా యూట్యూబ్ చానెల్ పెట్టొచ్చు కదా’ అనుకుంది. అతని సాయంతో 2018లోనే ‘భూమిక కిచెన్’ పేరుతో చానెల్ పెట్టింది. ఆమె వంటలు చాలా రుచిగా చేస్తుంది. అందుకే కుకింగ్ వీడియోలు చేయాలి అనుకుంది. చూపు లేకుండా వంట చేయడమంటే మామూలు విషయం కాదు. పాడైపోయిన కూరగాయలను గుర్తించడం నుంచి వంటకాల్లో వేసే ఇంగ్రెడియెంట్స్‌ని పసిగట్టడం వరకు ప్రతిదీ ఒక్కో టాస్క్.
అందుకే మొదట్లో వంట చేయడానికి కాస్త ఇబ్బందిపడింది. ఆమె ప్రయాణం స్క్రీన్‌పై కనిపించేంత సాఫీగా ఏం సాగలేదు. భూమిక తన స్పర్శజ్ఞానంపైనే పూర్తిగా ఆధారపడింది. అందుకే వంట చేస్తుంటే ఎన్నో గాయాలయ్యాయి. వాటన్నింటినీ ఓర్చుకుంది. కాలిన గాయాలు, చాకు గీతలు ఆమె సంకల్ప శక్తిని పరీక్షించాయి. ఆమెకు తగిలిన ఎదురుదెబ్బల ద్వారానే తన స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంది. మొదట్లో ఫ్యామిలీ సాయం తీసుకున్నా ఇప్పుడు ఎవరి సాయం లేకుండానే వంట చేయగలుగుతోంది.
ఆమె పాక నైపుణ్యాలను ఇప్పుడు ఎంతోమంది మెచ్చుకుంటున్నారు. కూరగాయలు శుభ్రం చేయడం, వాటిని సరిగ్గా కోయడం, వాసనను బట్టి మసాలాలను గుర్తించడం, వాటిని తగిన మోతాదులో వేయడం.. ఇలా అన్ని పనులు తనే స్వయంగా చేస్తోంది. దృష్టి లోపం ఉన్నా కచ్చితత్వంతో వంట చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మొదటి మహిళ
మన దేశంలో వంటల యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన మొట్టమొదటి అంధ మహిళ భూమిక. భూమిక చేసే వంటకాలు చాలా సింపుల్‌గా ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు. బ్యాచిలర్స్‌ని కొబ్బరి అన్నం, పులిహోర పొడి చాలా ఆకట్టుకున్నాయి. చానెల్ పెట్టిన రెండు నెలల్లోనే ఆమె వీడియోలకు వ్యూస్ పెరిగాయి. పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. భూమిక చాలా సులభంగా, తక్కువ ఇంగ్రెడియెంట్స్‌తో ఎలా వంట చేయాలో తన వీడియోల ద్వారా చూపిస్తోంది. “చూపు పోయిన తర్వాత చాలా బాధపడ్డాను. కానీ.. యూట్యూబ్ చానెల్ పెట్టిన తర్వాత పనిలో నిమగ్నమవడంతో ఆ బాధను మర్చిపోగలిగా.
ఇప్పుడు నా కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడపుతున్నా. నా వంట యూట్యూబ్‌లో ఇంత ప్రాచుర్యం పొందడానికి నా భర్తే కారణం. కొన్నిసార్లు ఆయన నాకు ప్రత్యేక వంటకాల గురించి చెప్తుంటాడు’’ అని చెప్పింది భూమిక. ఇప్పటివరకు తన యూట్యూబ్ చానెల్‌లో 1500కు పైగా వంట వీడియోలను అప్‌లోడ్ చేసింది. కానీ.. వీడియోల్లో ఆమె ఎక్కడా పెద్దగా కనిపించదు. కుకింగ్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తోంది. చానెల్‌కు దాదాపు లక్ష మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. అయినా.. ఒక వీడియోకు 14 లక్షల వ్యూస్ వచ్చాయి. చానెల్ ద్వారా ప్రతినెలా ఆమెకు ఆదాయం కూడా వస్తోంది.
కుటుంబమే బలం
భూమిక చూపు కోల్పోయిన తర్వాత ‘బ్లైండ్ ఫ్రెండ్లీ కుకింగ్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరింది. అందులో ఉన్నవాళ్లు ఆమెకు సలహాలు ఇస్తూ సాయం చేస్తారు. ఆమె భర్త సుదర్శన్ భూమికకు ప్రధాన బలం. అతనే వంట వీడియోలను షూట్ చేసి, ఎడిట్ చేస్తాడు. భూమికకు సుదర్శన్ తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు.
ఆమె అత్త సుమంగళ, మామ రుమలే నాగరాజ్ సొంత తల్లిదండ్రుల్లా ఆమెకు అండగా నిలిచారు. ఆమెకు అవసరమైనప్పుడల్లా సాయం అందించారు. భూమిక ఒకప్పుడు తన కూతురి చేతులు పట్టుకుని తొలి అడుగులు వేయడం నేర్పించింది. కానీ.. ఇప్పుడు పదేండ్ల అనుష్క తన తల్లి చేతులు పట్టుకుని ఆమె నడిచేందుకు సాయం చేస్తోంది. వంట గదిలో ఆమెకు సాయం చేస్తోంది.