
వర్షాకాలం వచ్చిందంటే రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్ ఒక సమస్య అయితే.. రోడ్లపై గుంతలు మరో సమస్య అని చెప్పాలి. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. ఒకవేళ గుంతలు పూడ్చినా కూడా గట్టిగా ఒక వర్షం పడితే.. మళ్ళీ గుంతలు ప్రత్యక్షం అవుతుంటాయి. తిరుపతి మున్సిపల్ అధికారులు రోడ్లపై గుంతల సమస్యకు చెక్ చెప్పే దిశగా అడుగులేస్తున్నారు. మనుషులతో పని లేకుండా రోడ్లపై గుంతలను నిమిషాల్లో పూడ్చే రోడ్ డాక్టర్ మెషిన్ తో గుంతల సమస్యకు స్వస్తి పలుకుతున్నారు అధికారులు.
రోడ్లపై ఏర్పడిన గుంతలను నిమిషాల్లో పూడ్చేందుకు వచ్చిన రోడ్ డాక్టర్ మెషిన్ ను పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ మౌర్య. నగరంలోని పలు రోడ్లపై ఏర్పడ్డ గుంతలను రోడ్ డాక్టర్ మెషిన్ తో పూడ్చారు. ఈ మెషిన్ ను సుమారు రూ. కోటిన్నర తో కొన్నామని అన్నారు మౌర్య.
నూతన టెక్నాలజీతో సిద్ధం చేసిన రోడ్ డాక్టర్ మెషిన్ ద్వారా ఎప్పటికప్పుడు గుంతలను పూడ్చేందుకు అవకాశం ఉందని అన్నారు మౌర్య.ఈ మెషిన్ తో సీసీ రోడ్లు, తారు రోడ్లు పూడ్చచ్చని తెలిపారు కమిషనర్ మౌర్య.