- జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళన
- బుధవారం అధిక సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ యువత కంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటేనే ప్రేమెక్కువని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రశ్నించింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని బుధవారం ఎక్స్‌వేదికగా తెలిపింది. బుధవారం కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ధర్నాను కొనసాగించారు. సోమవారం సీజేపీ ‘సంసద్ చలో’ మార్చ్‌పై పోలీసులు జరిపిన అణచివేత చర్యల అనంతరం ఆ ప్రాంతంలో భారీ భద్రతను మోహరించినప్పటికీ నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనను కొనసాగించారు.
మంగళవారం రాత్రి మరింత మంది మద్దతుదారులు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టము. జులై 20 భారతదేశ రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఒక మైలురాయి వంటి ఘట్టం. యువత ఇకపై మౌనంగా ఉండదు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్దకు వేలాది మంది వచ్చారు. ఇంకా లక్షలాదిగా తరలివస్తారు’ అని ఆయన అన్నారు.
కాగా, జంతర్ మంతర్ మినహా మరెక్కడా ఎలాంటి సమావేశానికి తమ ఉద్యమం పిలుపునివ్వలేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మా శాంతియుత నిరసన కొనసాగుతున్న జంతర్ మంతర్ వద్ద తప్ప మరెక్కడా సమావేశం కావాలని సీజేపీ పిలుపునివ్వలేదు. ఢిల్లీలో అల్లర్లు సృష్టించడానికి కొందరు గూండాలను పంపినట్టు తమ బృందానికి సమాచారం అందింది. వారికి సీజేపీతో ఎలాంటి సంబంధం లేదు’ అని పేర్కొన్నారు.
బెంగాల్ నుంచి 20 సీఆర్పీఎఫ్ కంపెనీలు ఢిల్లీకి
సీజేపీ నిరసనలు, రాజకీయ ప్రదర్శనలు, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 20 అదనపు సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించింది. మంగళవారం రాత్రి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో బెంగాల్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను విమానాల్లో తరలిస్తున్నారు. కోల్‌కతా నుంచి మొత్తం 20 సీఆర్పీఎఫ్ కంపెనీలను విమానాల్లో ఢిల్లీకి తరలించి మోహరిస్తున్నట్టు భద్రతా సంస్థలోని అధికారిక వర్గాలు మీడియాకు తెలిపాయి.
నిరసనల సందర్భంగా పలుమార్లు హింసాత్మక ఘర్షణలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. కొన్ని నెలల క్రితం బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ కంపెనీలను అక్కడ మోహరించారని, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు వాటిని అక్కడే ఉంచామని వారు తెలిపారు. ఒక సీఆర్పీఎఫ్ కంపెనీలో సుమారు 100 మంది సిబ్బంది ఉంటారు. సీజేపీ నిరసన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల దృష్ట్యా సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ కు చెందిన సుమారు 30 కంపెనీలను కేంద్రం ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు అందించినట్టు అధికారులు వివరించారు.
